- పరిశ్రమే ప్రధానం
న్యూఢిల్లీ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌లో పలు ప్రతిపాదనలు చేశారు. తద్వారా దేశీ తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు, మరిన్ని ఉద్యోగాల కల్పనకు తోడ్పాటునందించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా కార్పొరేట్ పన్నును ఇతర దేశాలతో పోటీపడేలా 25 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించడంతో పాటు కొన్నింటిపై కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలను తగ్గించారు. మరికొన్ని ఉత్పత్తుల దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని పెంచి, దేశీ తయారీ పరిశ్రమకు ఊపుతెచ్చారు.
మొబైళ్లు, ట్యాబెట్లను దిగుమతి చేసుకునే బదులు ఇక్కడ ఉత్పత్తి చేయడాన్ని ప్రోత్సహించేలా సుంకాల్ని సవరించారు. ఇన్సులేటెడ్ వైర్లు..కేబుల్స్, ఫ్రిజ్‌లలో కంప్రెసర్ భాగాలు, ఎరువుల తయారీలో ఉపయోగించే సల్ఫ్యూరిక్ యాసిడ్ మొదలైన వాటిపై కస్టమ్స్ సుంకాలను తగ్గించారు. ఇక లేథ్ మెషీన్లలో ఉపయోగించే కొన్ని ముడి వస్తువులపై కస్టమ్స్ సుంకాలను 7.5 శాతం నుంచి 2.5 శాతానికి, మెడికల్ వీడియో ఎండోస్కోప్‌లపై 5% నుంచి 2.5 శాతానికి తగ్గుతాయి.
అలాగే, స్మార్ట్ కార్డులకి సంబంధించి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ మాడ్యూల్స్ తయారీలో ఉపయోగించే వేఫర్లు మొదలైన వాటిపై ఎక్సైజ్ సుంకాన్ని 12 శాతం నుంచి 6 శాతానికి కుదించారు ఆర్థిక మంత్రి. పేస్‌మేకర్ల తయారీలో ఉపయోగపడే నిర్దిష్ట ముడి వస్తువులపై ఎక్సైజ్ సుంకాన్ని ఎత్తివేశారు. ఇనుము, ఉక్కు, రాగి, అల్యూమినియం మొదలైన మెటల్ స్క్రాప్‌పై ప్రత్యేక అదనపు సుంకాన్ని (ఎస్‌ఏడీ) 4 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు. ఇక, ఎల్‌ఈడీ లైట్లు తయారీలో ఉపయోగపడే ముడివస్తువులపై నాలుగు శాతంగా ఉన్న ఎస్‌ఏడీని పూర్తిగా తొలగించారు. సాంకేతిక అంశాలపరంగా చిన్న తరహా సంస్థలు ఎదుర్కొనే సమస్యలను కూడా పరిష్కరించడంపై జైట్లీ దృష్టి పెట్టారు.
టెక్నికల్ సర్వీసులకు సంబంధించిన రాయల్టీపై పన్ను రేటును 25 శాతం నుంచి 10 శాతానికి కుదించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 దాకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నోటిఫైడ్ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేసే తయారీ యూనిట్లకు అదనంగా 15 శాతం మేర పెట్టుబడిపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు మరో 15 శాతం మేర తరుగుద ల చూపించుకునే వెసులుబాటు కల్పించారు. విద్యుదుత్పత్తి, పంపిణీ విషయంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్లాంటు, యంత్రాలపై అదనంగా మరో 20 శాతం మేర తరుగుదల చూపించుకునే వీలు కల్పించారు. వీటన్నింటికంటే మించి దేశీయ మౌలిక రంగానికి కేటాయింపులు పెంచడం ద్వారా దేశీయ ఉత్పాదక రంగానికి ఊపుతెచ్చే ప్రయత్నం చేశారు. కాగా.. దేశీయ తయారీ సంస్థలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా దిగుమతి చేసుకున్న వాణిజ్య వాహనాలపై కస్టమ్స్ డ్యూటీని పది శాతం నుంచి 40 శాతానికి పెంచారు.