‘తయారీ’కి తాయిలం
- కేంద్ర బడ్జెట్‌లో ‘మేక్ ఇన్ ఇండియా’కు పెద్దపీట
- కార్పొరేట్ పన్ను నాలుగేళ్లలో 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గింపు
- ముడిసరకులపై కస్టమ్స్ సుంకం రద్దు.. గార్ అమలు రెండేళ్లు వాయిదా
- 12.36 శాతంగా ఉన్న సేవా పన్ను, విద్యా సెస్సులు 14 శాతానికి పెంపు
- వేతనజీవికి నిరాశ.. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి యథాతథం
- నల్లధనంపై త్వరలో కొత్త చట్టం.. విదేశాల్లో ఆస్తులను ‘దాస్తే’ పదేళ్ల జైలు
- 2016 ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి జీఎస్‌టీ
న్యూఢిల్లీ: దేశంలో అధిక సంఖ్యాకులుగా ఉన్న యువతకు ఉపాధి కల్పించాలంటే ప్రపంచంలో భారతదేశాన్ని తయారీ కేంద్రంగా మలచాలని పేర్కొన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ.. ‘భారీ వ్యయాల ద్వారా అభివృద్ధిని ప్రోత్సహించటం - ఉద్యోగాలను సృష్టించటం మధ్య సమన్వయం కోసం ఈ బడ్జెట్‌లో కసరత్తు చేశాం’ అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం మేరకు.. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి విదేశీ, దేశీయ పెట్టుబడులను ఆకర్షించటం కోసం, పరిశ్రమల స్థాపన, వ్యాపారం సులభతరం చేసేందుకు పలు చర్యలను ప్రకటించారు. ప్రస్తుతం 30 శాతంగా ఉన్న కార్పొరేట్ పన్నును క్రమంగా 25 శాతానికి తగ్గిస్తామని చెప్పారు. అదే సమయంలో కార్పొరేట్ పన్నులకు సంబంధించి అమలులో ఉన్న వివిధ రాయితీలు, ప్రయోజనాలను క్రమంగా తగ్గిస్తామన్నారు. వివాదాస్పద ‘గార్’ అమలును మరో రెండేళ్లు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఆదాయ పన్ను రేట్లలో మార్పు లేదు గానీ...
ఈ బడ్జెట్‌లో వ్యక్తిగత, కార్పొరేట్ ఆదాయపన్ను రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. అయితే.. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఏడాదికి గరిష్టంగా రూ.4,44,200 వరకూ పన్ను మినహాయింపు పొందేలా పలు మినహాయింపులను ప్రకటించారు.
వస్తువులు, సేవలపై పన్నులు ఇలా...
ప్రస్తుతం 12.36 శాతంగా ఉన్న సేవా పన్ను, విద్యా సెస్సులను 14 శాతానికి పెంచారు. సేవా పన్నుల్లో ‘వ్యతిరేక జాబితా’ను తగ్గిస్తున్నట్లు చెప్పారు. పన్ను పరిధిని పెంచటానికి కొన్ని ఇతర మినహాయింపులను ఉపసంహరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫలితంగా ఫోన్ కాల్స్, విమానప్రయాణం, రెస్టారెంట్లలో భోజనం, బ్యూటీపార్లర్ల సేవలు వంటి వాటి ధరలు పెరగనున్నాయి. ఇదిగాక.. పన్ను పరిధిలోని సేవలపై భవిష్యత్తులో రెండు శాతం ‘స్వచ్ఛ భారత్’ సెస్సు వసూలు చేస్తామన్నారు. పరోక్ష పన్నుల్లో.. ముడి పదార్థాలపై ప్రాధమిక కస్టమ్స్ సుంకాన్ని తగ్గించారు. తోలుతో చేసిన పాదరక్షలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు.
పండ్లు, కూరగాయలకు సంబంధించి శీతల గిడ్డంగుల్లో నిల్వ చేయటానికి ముందు అందించే సేవలపై పన్నును మినహాయంపునిచ్చారు. తోలుతో చేసిన పాదరక్షలు, దేశీయంగా తయారైన మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ ట్యాబ్లెట్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, ప్యాక్ చేసిన ఫలాలు, అంబులెన్స్ సేవలు వంటి వాటి ధరలు తగ్గనున్నాయి. గత ఆర్థికమంత్రుల లాగానే.. జైట్లీ కూడా ధూమపాన ప్రియులపై కఠినంగా వ్యవహరించారు. సిగరెట్లు, సిగార్లు, చెరూట్లపై సుంకాన్ని 25 శాతం వరకూ పెంచారు. సిమెంట్ కూడా మరింత ప్రియం కానుంది. ప్రత్యక్ష పన్నులపై చేసిన ప్రతిపాదనల ఫలితంగా రూ. 8,315 కోట్ల ఆదాయం తగ్గిపోతే.. పరోక్ష పన్నులపై చేసిన ప్రతిపాదనల వల్ల రూ. 23,383 కోట్లు ఆదాయం లభిస్తుందని.. మొత్తం ప్రతిపాదనల ద్వారా వచ్చే ఏడాది రూ. 15,068 కోట్ల అదనపు ఆదాయం ఆర్జిస్తామని వివరించారు.
మౌలికవసతుల రంగానికి రూ. 70,000 కోట్లు...
రైల్వేలు, రహదారులు, సాగునీటి సంస్థలు.. పన్ను రహిత మౌలికవసతుల బాండ్ల ద్వారా నిధులు సమీకరించుకోవడానికి అవకాశం కల్పించారు. మౌలిక వసతుల రంగానికి రూ. 70,000 కోట్లు కేటాయించారు. పెట్రోలు, డీజిల్‌లపై వసూలు చేసే ఎక్సైజ్ సుంకంలో కొంత రహదారి సుంకంగా మార్చారు. తద్వారా.. రహదారుల నిర్మాణానికి అందుబాటులో ఉండే మూల నిధి మరో రూ. 40,000 పెరుగుతుందని పేర్కొన్నారు.
జీఎస్‌టీ, జేఏఎం త్రయం.. విప్లవాత్మక సంస్కరణలు
భారతదేశంలో రెండు విప్లవాత్మక సంస్కరణలను ప్రారంభించామని.. అందులో ఒకటి జీఎస్‌టీ అయితే మరొకటి ప్రయోజనాలను నేరుగా బదిలీ చేసే జేఏఎం త్రయం (జనధన యోజన, ఆధార్, మొబైల్) అని జైట్లీ చెప్పారు. జీఎస్‌టీ ద్వారా 2016 ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశంలో అత్యాధునిక ప్రత్యక్ష పన్ను వ్యవస్థ అమలులోకి వస్తుందన్నారు. జేఏఎం త్రయం ద్వారా ప్రభుత్వ ప్రయోజనాలను లీకేజీ రహితంగా, మరింత లక్ష్యపూరితంగా, నగదు రహితంగా బదిలీ జరుగుతుందని చెప్పారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వంటి సామాజిక రంగ పథకాలకు కేటాయింపులు పెంచారు. పేదలు, అణగారిన వర్గాలకు సంబంధించిన సామాజిక రంగ వ్యయంలో.. విద్యా రంగానికి రూ. 68,968 కోట్లు, వైద్య రంగానికి రూ. 33,152 కోట్లు, గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ పథకాలకు కలిపి రూ. 77,526 కోట్లు, గృహనిర్మాణం, పట్టణాభివృద్ధిలకు రూ. 22,407 కోట్లు కేటాయించారు.
నల్లధనంపై కొత్త చట్టం... బంగారం బాండ్లు...
నల్లధనాన్ని వెలికితీస్తామన్న హామీలు నెరవేరకపోతుండటంపై సర్కారు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. విదేశీ ఆస్తులను దాచిపెడితే పదేళ్ల వరకూ జైలు శిక్ష, విదేశాల్లో అప్రకటిత ఆదాయం, ఆస్తులు ఉన్నట్లయితే 300 శాతం వరకూ జరిమానా విధించేలా కొత్తగా ఒక సమగ్ర చట్టాన్ని తీసుకువస్తామని జైట్లీ ప్రకటించారు. బంగారు లోహం కొనుగోళ్లకు ప్రత్యామ్నాయంగా.. బంగారు బాండ్లను ప్రవేశపెడతామని ప్రకటించారు. ఈ బాండ్లపై నిర్ణీత వడ్డీ రేటు చెల్లింపులు ఉంటాయని, వాటిని నగదులోకి మార్చుకునేటపుడు అప్పటి బంగారం ముఖ విలువను పొందవచ్చని వివరించారు.
అతి త్వరలో రెండంకెల ఆర్థికాభివృద్ధి...
ఆర్థిక వ్యవస్థ గత తొమ్మిదేళ్లలో నాటకీయంగా మలుపు తిరిగిందని.. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్‌ను నిలబెడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు 8 - 8.5 శాతం వరకూ పెరగవచ్చని భావిస్తున్నామని.. అతి త్వరలో రెండంకెల వృద్ధి సాధ్యంగా కనిపిస్తోందని ఆశాభావం వ్యక్తంచేశారు. స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని పునరుద్ధరించామని.. స్థిరమైన పేదరిక నిర్మూలనకు, ఉద్యోగ సృష్టికి, దృఢమైన రెండంకెల ఆర్థికాభివృద్ధికి అవసరమైన పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు.
కర్ణాటకలో ఐఐటీని, ఆంధ్రప్రదేశ్, జమ్మూకశ్మీర్‌లలో ఐఐఎంలను ఏర్పాటు చేస్తామన్న జైట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక సహాయ నిధిని అందిస్తామన్నారు. అదే తరహా ప్రత్యేక సహాయాన్ని.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకూ ప్రకటించారు. కశ్మీర్, పంజాబ్, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్, అస్సాంలలో కొత్తగా ఎయిమ్స్ సంస్థలు ఏర్పాటు చేస్తామన్నారు. బీహార్‌లో ఎయిమ్స్ తరహా సంస్థ ఏర్పాటును ప్రకటించారు. మొత్తంగా.. పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగకల్పన, ఆర్థికాభివృద్ధి లక్ష్యాలుగా 2015-16 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ శనివారం పార్లమెంటుకు సమర్పించారు. తొమ్మిది నెలల కిందట కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్‌డీఏ సర్కారు రూపొందించిన తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌లో ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యతల మధ్య సంతులనం సాధించేందుకు ప్రయత్నించారు.