ప్రోటోకాల్ పాటించకే ప్రాణాలు పోయాయ్!
హుస్సేనాబాద్: ప్రోటోకాల్ పాటించకపోవడం మూలంగానే బుధవారం జార్ఖండ్లో మావోయిస్టులు పేల్చిన మందుపాతరలో ఏడుగురు పోలీసులు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు ఫోర్ వీలర్ వాహనాల్లో ప్రయాణించొద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ.. వాటిని పెడచెవిన పెట్టి ఒకే మినీ ట్రక్కులో 13 మంది సిబ్బంది ప్రయాణించడం వల్లే మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
హుస్సేనాబాద్కు 22 కిలోమీటర్ల దూరంలో చిన్న కల్వర్టు వద్ద పేల్చిన మందుపాతరతో మీటరులోతుతో పెద్ద గొయ్యి ఏర్పడింది. పోలీసులు మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. దుండగులు మందుపాతరను కేవలం 50 మీటర్ల దూరం నుండి పేల్చినట్లు పోలీసులు గుర్తిచారు. పేలుడు దాటికి ధ్వంసమైన మినీ ట్రక్కు భాగాలు 100 మీటర్ల పరిధిలో చెల్లాచెదురుగా పడ్డాయి.
ఈ ఘటనపై జార్ఖండ్ డీజీపీ డీకే పాండే మాట్లాడుతూ.. 'రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారిగా మా సిబ్బంది నిబంధనల ఉల్లంఘనకు నేను బాధ్యత వహిస్తున్నాను. కానీ జవాన్ల మరణాన్ని వృధాగా పోనివ్వం. 2016లో జార్ఖండ్లో మావోయిస్టులను లేకుండా చేస్తాం' అని తెలిపారు.