
తన సహాయకురాలితో స్కూటీపై కిరణ్‌బేడీ
పుదుచ్చేరి: రాత్రి సమయంలో మహిళలకు ఏ విధమైన రక్షణ ఉందో పరిశీలించటానికి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఓ సాహసం చేశారు. శుక్రవారం రాత్రి సహాయకురాలితో కలిసి ఆమె స్కూటీపై కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో తిరిగారు. తననెవరూ గుర్తుపట్టకుండా బేడీ శాలువా కప్పుకున్నారు. ‘పుదుచ్చేరిలో రాత్రిపూట మహిళలు సురక్షితమే..అయినప్పటికీ భద్రతను మరింత మెరుగుపరుస్తాం’ అని బేడీ ట్వీటర్‌లో తెలిపారు.
ప్రజలకు సమస్యలేమైనా ఉంటే పీసీఆర్ లేదా 100కు ఫోన్ చేయాలని సూచించారు. కిరణ్‌బేడీ చర్యను పలువురు నెటిజన్లు ప్రశంసించారు. అయితే స్కూటీని నడుపుతున్న మహిళతో పాటు బేడీ కూడా హెల్మెట్ ధరించకపోవడంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. దీంతో రాత్రిపూట తాము నిస్సహాయంగా కనిపించడంతో పాటు ఆ సమయంలో స్కూటీ నడిపే సగటు మహిళ పరిస్థితి ఏంటో తెలుసుకోవడానికే హెల్మెట్ ధరించలేదని బేడీ వివరణ ఇచ్చారు.