పుదుచ్చేరిపై హైదరాబాద్ విజయం
విజయ్ హజారే ట్రోఫీ
అహ్మదాబాద్: లెఫ్టార్మ్ పేసర్ సీవీ మిలింద్ (5/13) నిప్పులు చెరగడంతో... విజయ్ హజారే టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు రెండో విజయం ఖాతాలో వేసుకుంది. గ్రూప్ ‘సి’లో భాగంగా శనివారం జరిగిన పోరులో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో పుదుచ్చేరిని మట్టికరిపించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పుదుచ్చేరి 31.5 ఓవర్లలో 98 పరుగులకు ఆలౌటైంది.
పారస్ (57 బంతుల్లో 26; 3 ఫోర్లు) టాప్ స్కోరర్... కాగా తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. మొత్తం జట్టులో ముగ్గురు ప్లేయర్లు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. హైదరాబాద్ బౌలర్లలో మిలింద్ 9.5 ఓవర్లు బౌలింగ్ చేసి 13 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. తనయ్ త్యాగరాజన్ 3 వికెట్లు తీయగా... మొహమ్మద్ ముదస్సిర్, నిశాంత్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
అనంతరం లక్ష్యం చిన్నదే అయినా హైదరాబాద్ జట్టు తడబడింది. చివరకు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. హిమతేజ (61 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మిలింద్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’అవార్డు దక్కింది. తదుపరి మ్యాచ్‌లో మంగళవారం కర్ణాటకతో హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది.
భరత్, హెబర్ మెరుపులు
బౌలర్ల క్రమశిక్షణకు ఓపెనర్ల దూకుడు తోడవడంతో దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర జట్టు మూడో విజయం నమోదు చేసుకుంది. గ్రూప్ ‘బి’లో భాగంగా శనివారం జరిగిన పోరులో ఆంధ్ర జట్టు 10 వికెట్ల తేడాతో సర్వీసెస్‌ను చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సర్వీసెస్ 36.2 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. అర్జున్ శర్మ (39; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... అన్షుల్ గుప్తా (23), వినీత్ (23), అరుణ్ (22) తలా కొన్ని పరుగులు చేశారు.
ఆంధ్ర బౌలర్లలో పిన్నింటి తపస్వి 4 వికెట్లు పడగొట్టగా... పృథ్వి రాజ్, శశికాంత్ చెరో రెండు వికెట్లు తీశారు. లక్ష్యఛేదనలో ఆంధ్ర జట్టు 28.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 163 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రీకర్ భరత్ (90 బంతుల్లో 86 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), అశ్విన్ హెబర్ (66 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధశతకాలతో రాణించారు.
ఈ టోర్నీలో ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లాడిన ఆంధ్ర జట్టు 3 విజయాలు, ఒక ‘డ్రా’తో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని గ్రూప్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది. తపస్వికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. తదుపరి మ్యాచ్‌లో మంగళవారం మేఘాలయతో ఆంధ్ర జట్టు తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment