తనయ్, అనికేత్‌ మాయాజాలం | Hyderabad wins against Arunachal Pradesh in the last match | Sakshi
Sakshi News home page

తనయ్, అనికేత్‌ మాయాజాలం

Published Mon, Jan 6 2025 4:18 AM | Last Updated on Mon, Jan 6 2025 4:19 AM

Hyderabad wins against Arunachal Pradesh in the last match

చివరి మ్యాచ్‌లో అరుణాచల్‌ ప్రదేశ్‌పై హైదరాబాద్‌ విజయం

అహ్మదాబాద్‌: విజయ్‌ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌ను హైదరాబాద్‌ జట్టు విజయంతో ముగించింది. ఆదివారం జరిగిన గ్రూప్‌ ‘సి’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 8 వికెట్ల తేడాతో అరుణాచల్‌ ప్రదేశ్‌ జట్టును ఓడించింది. టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ బౌలింగ్‌ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన అరుణాచల్‌ ప్రదేశ్‌ 28.3 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. 

హైదరాబాద్‌ ఎడంచేతి వాటం స్పిన్నర్లు తనయ్‌ త్యాగరాజన్‌ 32 పరుగులిచ్చి 5 వికెట్లు... గంగం అనికేత్‌ రెడ్డి 14 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి అరుణాచల్‌ ప్రదేశ్‌ను దెబ్బ కొట్టారు. మరో వికెట్‌ పేసర్‌ చామా మిలింద్‌కు లభించింది. అరుణాచల్‌ జట్టుతో సిద్ధార్త్‌ బలోడి (29; 5 ఫోర్లు), ధ్రువ్‌ సోని (20; 3 ఫోర్లు), బిక్కీ కుమార్‌ (15; 3 ఫోర్లు) మినహా ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. 97 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ 12 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసి గెలిచింది. 

తన్మయ్‌ అగర్వాల్‌ (19 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్‌), కనాలా నితేశ్‌ రెడ్డి (16 బంతుల్లో 15; 2 ఫోర్లు) అవుటయ్యారు. పట్కూరి నితేశ్‌ రెడ్డి (31 బంతుల్లో 29 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), హిమతేజ (12 బంతుల్లో 21 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) అజేయంగా నిలిచారు. తనయ్‌ త్యాగరాజన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. 

నాలుగో స్థానంతో సరి 
ఎనిమిది జట్లున్న గ్రూప్‌ ‘సి’లో హైదరాబాద్‌ జట్టు ఏడు మ్యాచ్‌లు ఆడింది. నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి, మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి నాకౌట్‌ దశకు అర్హత సాధించలేకపోయింది. నాగాలాండ్, పుదుచ్చేరి, కర్ణాటక, అరుణాచల్‌ ప్రదేశ్‌ జట్లపై నెగ్గిన హైదరాబాద్‌... ముంబై, సౌరాష్ట్ర, పంజాబ్‌ జట్ల చేతుల్లో ఓడిపోయింది.

ఓవరాల్‌గా ఈ టోర్నీలో హైదరాబాద్‌ తరఫున బ్యాటింగ్‌ విభాగంలో అరవెల్లి అవనీశ్‌ రావు (7 మ్యాచ్‌ల్లో 241 పరుగులు; 1 సెంచరీ, 2 అర్ధ సెంచరీలు), తన్మయ్‌ అగర్వాల్‌ (7 మ్యాచ్‌ల్లో 227 పరుగులు; 2 అర్ధ సెంచరీలు), వరుణ్‌ గౌడ్‌ (7 మ్యాచ్‌ల్లో 203 పరుగులు; 1 సెంచరీ, 1 అర్ధ సెంచరీ) ఆకట్టుకున్నారు. 

బౌలింగ్‌ విషయానికొస్తే చామా మిలింద్‌ 7 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు... తనయ్‌ త్యాగరాజన్‌ 7 మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లు పడగొట్టారు. అనికేత్‌ రెడ్డి, శరణు నిశాంత్, ముదస్సిర్‌ 7 వికెట్ల చొప్పున తీశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement