లక్నో : ‘మీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం.. ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకు సమయం, ప్రదేశాన్ని నిర్ణయించండి’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ సైనికులకు పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ ప్రాంతంలోని బుందేల్‌ఖండ్‌లో డిఫెన్స్ కారిడార్ నిర్మాణానికి ప్రధాని శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రసంగిస్తూ... పుల్వామా ఉగ్రదాడికి బదులు తీర్చుకునేందుకు భారత సైన్యానికి అన్ని రకాల అనుమతులు ఇస్తున్నామని పేర్కొన్నారు. ‘మన జవాన్ల త్యాగం వృథా కాదు.. వారి సాహసాన్ని భరతజాతి మొత్తం వీక్షించింది. వారిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది’ అని మోదీ వ్యాఖ్యానించారు.(చదవండి : ఉగ్ర మారణహోమం)
పాక్ ఆర్థిక సాయం కోసం యాచిస్తోంది..
ఉగ్రదాడితో తమకు సంబంధం లేదంటూ బుకాయిస్తున్న పాకిస్తాన్ తీరుపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘ పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అందుకే చేతిలో పాత్ర పట్టుకుని ప్రపంచ దేశాలను సాయం కోసం యాచిస్తోంది. కానీ వారికి ఎవరూ సహాయపడరు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్‌కు మద్దతుగా ఉన్నాయని మోదీ పునరుద్ఘాటించారు. ‘మన దాయాది దేశానికి సరైన సమాధానం ఇవ్వాలని భారతీయులు భావిస్తున్నారు. ప్రపంచంలోని చాలా వరకు దేశాలు మనకు అండగా ఉన్నాయి. పుల్వామా దాడి పట్ల వారు కేవలం సంతాపం తెలియచేయడానికే పరిమితం కాలేదు.. ఉగ్రవాదాన్ని అంతం చేయాలని భావిస్తున్న భారత్‌కు అన్ని రకాలుగా సహాయపడటానికి సిద్ధంగా ఉన్నారు’ అని పాక్‌ను హెచ్చరించారు.(పాకిస్తాన్‌కు దీటైన సమాధానం చెబుతాం)
కాగా గురువారం కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఆత్మహుతి దాడిలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ దాడిని తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment