
శ్రీనగర్ : పుల్వామా ఉగ్రదాడికి కశ్మీరీ ప్రజలు బాధ్యులు కాదన్న విషయం గుర్తుపెట్టుకోవాలని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న కశ్మీరీ విద్యార్థులపై దాడి జరగడంపై ఆయన స్పందించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ‘దయచేసి మమ్మల్ని కొట్టకండి. ఉగ్రదాడిలో మా ప్రమేయం లేదు. ఉగ్రవాదులతో మాకు సంబంధం లేదు. మేము గౌరవప్రదమైన జీవితాన్ని కోరుకుంటున్నాం. రెండు పూటలా మా కుటుంబాలకు భోజనం పెట్టడానికి మాత్రమే ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసేందుకు సిద్ధపడ్డాము. బంగ్లాలు కట్టడానికి కాదు. భవిష్యత్తు కోసం అక్కడ చదువుకుంటున్నాం. రాజకీయపరంగా కశ్మీర్ అంశం వరకు తేలేవరకు పుల్వామా లాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి’ అని ఫరూక్ వ్యాఖ్యానించారు.(పుల్వామా ఉగ్రదాడి: పైశాచిక ఆనందం)
ఓపిక పట్టండి..
పుల్వామా ఉగ్రదాడిలో మన తప్పు లేకున్నా.. మనల్ని నిందిస్తున్న వారి పట్ల సహనం వహించాలని ఫరూక్ కశ్మీరీలకు విఙ్ఞప్తి చేశారు. తమ సొంత ప్రయోజనాల కోసం కొంతమంది అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. వారి ప్రణాళికలు అమలు కాకుండా ఉండాలంటే ఓపికగా ఉండాలని పిలుపునిచ్చారు. కాగా పుల్వామా ఉగ్రదాడిని సమర్థిస్తూ పోస్టులు పెట్టిన కశ్మీరీ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సంగతి తెలిసిందే.(వాట్సాప్ పోస్ట్‌తో కశ్మీర్ విద్యార్థినుల అరెస్ట్)
Comments
Please login to add a commentAdd a comment