సాక్షి, న్యూఢిల్లీ: లాక్‌డౌన్ సందర్భంగా దేశంలో ఎక్కువ మంది ప్రజలు టీవీలు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. లాక్‌డౌన్ సందర్భంగానే కాకుండా అంతకుముందు కూడా స్క్రీన్లకు అతుక్కుపోయే అలవాటు పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఉంది. అధిక సమయం స్క్రీన్లకు అతుక్కుపోవడం వల్ల కళ్లు లాగడం, తలనొప్పి లేవడం, ఒళ్లు లావెక్కడం, నిద్రరాక పోవడం, హింసాత్మక దోరణులు ప్రబలడం, పలు రకాల మానసిక రుగ్మతలకు గురవడం జరుగుతుందని మొదటి నుంచి వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నారు.
మూడు నెలల వయస్సు నుంచి ప్రపంచంలో 40 శాతం పిల్లలు టెలివిజన్, డీవీడీలు, ఇతర వీడియోలు తరచుగా చూస్తున్నారని, అమెరికాలో వీరి సంఖ్య 90 శాతానికి చేరుకుందని సర్వేలు తెలియజేస్తున్నాయి. అమెరికాలో ఎనిమిదేళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులైన పిల్లలు ప్రతి రోజు సరాసరి ఏడు గంటల 11 నిమిషాల సేపు పలు రకాల వినోద స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. బ్రిటన్‌లో పెద్ద వాళ్లు ప్రతి 12 నిమిషాలకోసారి తమ ఫోన్లను చెక్ చేస్తున్నారట. ముఖ్యంగా లాక్‌డౌన్ సందర్భంగా స్క్రీన్లకు దూరంగా ఉండేందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
వారానికోరోజు: టీవీ, లాప్‌టాప్, ట్యాబ్‌లెట్లు ఆఫ్ చేయండి. స్మార్ట్ ఫోన్లను పక్కకు పెట్టండి. ఇంట్లో గార్డెనింగ్ పనులు చేయండి లేదా కుటుంబ సభ్యుల కోసం వంట చేసి పెట్టండి. వాకింగ్, జాగింగ్ లేదా ప్రావీణ్యం ఇతర క్రీడల్లో పాల్గొనండి, క్యారమ్స్, ఇతర హాబీలతో బిజీగా ఉండండి. ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా స్మార్ట్ ఫోన్‌ను జేబులో పెట్టుకోరాదు. అలా పెట్టుకున్నట్లయితే డైనింగ్ టేబుల్‌పైనా, టాయ్‌లెట్‌లో, పడకమీద పోస్టింగ్‌ల కోసం తరచూ స్క్రీన్‌ను చూస్తుంటాం. స్క్రీన్లకు ఎక్కువసేపు చూడడం వల్ల మెదడులో డొపమైన్ అనే హార్మోన్ ఎక్కువ విడుదలవుతుంది. అది అలవాటును బానిసగా మారుస్తుంది. డొపమైన్ ఎక్కువ విడదలయితే నిద్రరాదు. స్క్రీన్లకు దూరంగా ఉండడం వల్ల బోర్ కొడుతుంది. అది చాలా మంచిది బోర్ కొట్టినప్పుడు మనం సాధించాల్సిన లక్ష్యాల గురించి, వాటì కి అనుసరించాల్సిన మార్గాల గురించి ఆలోచిస్తాం. ఆ దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. (కరోనా వేళ : సినిమా చూసొద్దాం మామా..)
వారానికి కొన్ని రోజుల్లో కొంత సమయాన్ని కుటుంబ సభ్యుల కోసమే కేటాయించండి. ఆ సమయాల్లో స్క్రీన్లకు దూరంగా వారితోనే గడపండి. మొదట ఇబ్బందిగానే ఉంటుంది. ఆ తర్వాత అలవాటు అవుతుంది. ఆ తర్వాత అందులోనుంచి వచ్చే అనుభూతి ఆనందాన్ని ఇస్తుంది. ప్రొఫెషన్‌లో భాగంగా ఇంటి వద్ద స్క్రీన్ మీద పని చేయాల్సి వచ్చినప్పుడు గంటకోసారి లేవండి. పది నిమిషాలు అలా ఇల్లు చుట్టి రండి. టీ చేసుకొని తాగండి, ఇంటి ప్రహారాలోపల ఖాళీ స్థలంలో ఉంటే లేదంటే మేడ మీద అడ్డదిడ్డంగా వేగంగా పరుగెత్తండి. తెలిసిన వ్యాయామాలు చేయండి. వొళ్లు విరుచుకోండి. స్క్రీన్‌పై చేయాల్సిన పని పూర్తయ్యాక కాసేపు అటు, ఇటు నడిచి వేళకు భోజనం చేసి, నిద్రవేళకు పడక ఎక్కండి. వినోదం కోసం రోజుకు రెండు గంటలకు మించి స్క్రీన్లకు అతుక్కుపోతే అది మెదడు మీద ప్రభావాన్ని చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకని ప్రతి ఒక్కరిని స్క్రీన్లకు అతుక్కుపోయే సమయాన్ని తగ్గించాలని వారు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment