రాహుల్ కు చుక్కలు చూపించిన అమ్మాయిలు!
బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మానస పథకాలు 'స్వచ్ఛ భారత్', 'మేక్ ఇన్ ఇండియా'.. ఈ పథకాలను విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలు ఆయనకే తిప్పికొట్టినట్టు కనిపించాయి. రాహుల్ గాంధీ బుధవారం బెంగళూరులోని ప్రతిష్టాత్మక మౌంట్ కార్మెల్ మహిళా కాలేజీలో ప్రసంగించారు. విద్యార్థులను ఉద్దేశించిన మాట్లాడిన రాహుల్ గాంధీ 'సూటు-బూటు' ప్రభుత్వం అంటూ మోదీ ప్రభుత్వంపై ధాటిగా విమర్శలు కురిపించారు. మోదీ ప్రభుత్వం మాటలైతే మాట్లాడుతుందికానీ.. దానికి దిశానిర్దేశం లేదని ధ్వజమెత్తారు. 'మోదీ ప్రభుత్వం చెప్తున్న ఎన్నో మాటలు వింటున్నా. కానీ స్పష్టమైన దిశానిర్దేశం కనిపించడం లేదు. సీరియస్ గా దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు వ్యూహాత్మక జాతీయ పథకం ఉండాల్సిన అవసరముందా? అసలు ఇది పనిచేస్తుందా?' అని రాహుల్ ప్రశ్నించారు.
ఆహూతుల నుంచి 'లేదు' అనే సమాధానం వస్తుందని ఆశించారు. కానీ ఆయనను బిత్తరపరుస్తూ 'అవును' అని విద్యార్థినుల నుంచి బదులు వచ్చింది. దీంతో తడబడ్డ రాహుల్ మరింత బిగ్గరగా 'అది అమలవ్వడం మీరు చూశారా?' అడిగారు. 'అవును' (యెస్) అంటూ మరింత బిగ్గరగా అమ్మాయిలు సమాధానం ఇచ్చారు. ఈ అనుకోని షాక్ నుంచి తేరుకున్న ఆయన 'ఓకే. స్వచ్ఛ భారత్ బాగా పనిచేస్తున్నట్టు నాకైతే కనిపించడం లేదు' అని చెప్పారు.
అనంతరం రాహుల్ మరో ప్రశ్న అడిగేందుకు ప్రయత్నించారు. 'మేక్ ఇన్ ఇండియా' పనిచేస్తుందని మీరు భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఈసారి కొంతమంది అవును, కొంతమంది కాదు అన్నారు. ఇక ప్రశ్నలు అడుగడం మానుకున్న రాహుల్ మోదీ ప్రభుత్వానికి స్పష్టమైన విజన్ లేదంటూ తన ప్రసంగాన్నికొనసాగించారు.