‘సచ్ భారత్’ కావాలి
► అధికారంలోకి వచ్చాకే జాతీయ జెండాను గౌరవిస్తున్న ఆరెస్సెస్
► ‘కాంపోజిట్ కల్చర్’ సమావేశంలో రాహుల్ ధ్వజం
► హాజరైన 12 ప్రతిపక్ష పార్టీలు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ మానసపుత్రిక అయిన ‘స్వచ్ఛ్ భారత్’ కన్నా ‘సచ్ భారత్’ ముఖ్యమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సత్యానికి విలువ ఇచ్చే భారత్‌కే తమ మద్దతు ఉంటుందని తెలి పారు. ‘మన వైవిధ్య సంస్కృతిని కాపాడుకుందాం’ పేరిట జేడీయూ తిరుగుబాటు నేత శరద్ యాదవ్ గురువారం నిర్వహించిన సమావేశంలో రాహుల్... బీజేపీ, ఆరెస్సెస్, ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఎస్పీ, బీఎస్పీ, ఎన్‌సీపీ, ఆర్జేడీ, ఎన్సీ, జేడీఎస్, ఆర్‌ఎల్డీ తదితర 12 పార్టీలు హాజరయ్యాయి. అధికార బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చాయి. శరద్ యాదవ్ పోరాటానికి సంఘీభావంగా నిలిచాయి. బీజేపీ, ఆరెస్సెస్‌ని నిలువరించాలంటే ప్రతిపక్షాల ఐక్యత తప్పనిసరి అని రాహుల్ నొక్కి చెప్పారు. ‘మోదీ స్వచ్ఛ్ భారత్ సృష్టిస్తానంటున్నారు.
కానీ మనకు కావాల్సింది సచ్ భారత్. మనమంతా ఐక్యంగా పోరాడితే బీజేపీ, ఆరెస్సెస్ లాంటివి కనిపించకుండా పోతాయి. అసలు బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు ఆరెస్సెస్ ఎప్పుడూ జాతీయ జెండాకు వందనం చేయలేదు. ఇక్కడ దేశాన్ని రెండు పార్శా్వల్లో చూడాలి. ఒకరేమో ఈ దేశం నాదని అంటారు. మరొకరేమో నేను ఈ దేశానికి చెందుతాను అని అంటారు. ఆరెస్సెస్‌కు మిగతావారికి అదే తేడా’ అని రాహుల్ అన్నా రు. రాహుల్ వ్యాఖ్యలతో శరద్ యాదవ్ ఏకీభవించారు. ప్రజలు ఏకమైతే హిట్లర్ కూడా తుడిచిపెట్టుకుపోతాడన్నారు. మన ఉమ్మడి సంస్కృతిని కాపాడటంలో శరద్ యాదవ్ ముఖ్య పాత్ర పోషించాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి పేర్కొన్నారు.