
కరోనా కట్టడిలో కేంద్ర వైఫల్యంపై రాహుల్ ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడం పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారిని నియంత్రించే క్రమంలో సన్నద్ధతకు మనకు తగినంత సమయం ఉన్నా సరిగ్గా వ్యవహరించడంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఇది చాలా బాధాకరమని, కరోనాను పూర్తిగా కట్టడి చేసే అవకాశం ఉన్నా, సీరియస్‌గా తీసుకుని సన్నద్ధమవడంలో విఫలమయ్యామని రాహుల్ మంగళవారం ట్వీట్ చేశారు. వైద్య సిబ్బందికి తగిన భద్రత కల్పించడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చప్పట్లు కొట్టాలని పిలుపు ఇచ్చిందన్న ఓ వైద్యుడి ట్వీట్‌ను రాహుల్ ప్రస్తావించారు.
మరోవైపు భారత్‌లో కరోనా వైరస్ కేసులు 500 దాటగా మృతుల సంఖ్య పదికి పెరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారత్‌లో దాదాపు 20కిపైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈనెల 31 వరకూ లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్రైన్లు, విమానాల రాకపోకలు సహా అంతరాష్ట్ర రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ఇక ప్రాణాంతక వైరస్ వ్యాప్తితో అత్యవసర పరిస్థితి నెలకొన్న క్రమంలో భవన నిర్మాణ రంగ కార్మికులతో పాటు అసంఘటితరంగ కార్మికులను ఆదుకునేందుకు వారికి నగదు సాయం సహా పలు తక్షణ చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.