సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటంతో ప్రధాన పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారానికి ఇంకా మూడు రోజల గడువు మాత్రమే ఉండటంతో విమర్శలకు పదునుపెడుతున్నారు. ప్రచారంలో భాగంగా నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. మోదీ దేశంలోని ప్రతీది ప్రైవేటు పరం చేస్తున్నారని, ఏదో ఒక రోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తాజ్ మహల్‌ను కూడా అమ్మేస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఢిల్లీలోని జంగ్‌పురాలో ఏర్పాటు చేసిన ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. (‘మోదీజీ.. మాయాజాల వ్యాయామం మరింత పెంచండి’)
ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ.. మేక్ ఇన్ ఇండియా అనే మంచి నినాదాన్ని తీసుకొచ్చిన మోదీ ఆగ్రాలో కనీసం ఒక్క ఫ్యాక్టరీని కూడా నిర్మించలేదని విమర్శించారు. మతంపై ప్రధానికి అవగాహన లేదని, దేశ ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టడమే బీజేపీ పని అని దుయ్యబట్టారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగంపై మోదీ సర్కార్‌ను టార్గెట్ చేసిన రాహుల్.. రెండు కోట్ల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారా అని ప్రశ్నించారు. దేశంలోని యువతకు ఉద్యోగాలు కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని మండిపడ్డారు.
యువత తరఫున తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భయపడకూడదని హితవు పలికారు. అదే విధంగా ఢిల్లీలో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఏం చేశారని ప్రశ్నించారు. కాగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ ప్రచార బరిలో దిగడం ఇదే తొలిసారి. జంగ్‌పురా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి తార్విందర్ సింగ్ మార్వాకు మద్దతుగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment