రాహుల్కు తీవ్ర జ్వరం, టూర్ రద్దు
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పుదుచ్చేరి పర్యటనను ఆకస్మికంగా రద్దు చేసుకున్నారు. మంగళవారం పుదుచ్చేరిలో కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొనేందుకు షెడ్యూల్ ఖరారైంది. అయితే తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు సోమవారం అర్ధరాత్రి దాటక రాహుల్ ట్వీట్ చేశాడు. రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించనట్టు వెల్లడించారు. 10, 11న పుదుచ్చేరితో పాటు తమిళనాడు, కేరళలో పర్యటన రద్దయ్యింది. ఎన్నికల ప్రచారానికి రాలేనందుకు ఆయన కాంగ్రెస్ శ్రేణులకు క్షమాపణలు చెప్పారు. రాహుల్ గాంధీని చంపుతామంటూ సోమవారం బెదిరింపు లేఖలు వచ్చిన సంగతి తెలిసిందే.
రాహుల్ను చంపుతామంటూ గుర్తుతెలియని వ్యక్తులు తమిళంలో రాసిన లేఖలను పుదుచ్చేరి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నారాయణస్వామి ఇంటికి పంపారు. ఆయన ఈ విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లడంతో వారు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకుల విన్నపం మేరకు రాహుల్ గాంధీకి మరింత భద్రతను పెంచారు. రాజ్నాథ్ ఈ మేరకు ఇంటలిజెన్స్ బ్యూరో, ఎస్పీజీలను ఆదేశించారు.