'చూసేందుకు వచ్చాను.. రాజకీయాలకు కాదు'
♦ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాహుల్ సూచన
♦ తమిళనాడు, పుదుచ్చేరి వరద బాధితులకు పరామర్శ
చెన్నై, సాక్షి ప్రతినిధి: భారీ వర్షాలు, వరదలతో తమిళనాడు, పుదుచ్చేరి ప్రజలు సర్వం కోల్పోయారని, సహాయ కార్యక్రమాలు వేగవంతం చేయాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. భారీ వ ర్షాలు, వరదలతో అతలాకుతలమైన తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో మంగళవారం రాహుల్ పర్యటించారు. ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో పుదుచ్చేరికి చేరుకున్న రాహుల్ అక్కడి నుంచి కడలూరు, కారైక్కాల్ జిల్లాలోని వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించి వస్తు సామాగ్రిని అందజేశారు. సాయంత్రం చెన్నైకి చేరుకుని ముడిచ్చూరు, మణిమంగళంలలో వరదబాధితులను కలుసుకున్నారు.
విల్లివాక్కంలో కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని సందర్శించారు. అనంతరం విలేకర్లతో రాహుల్ మాట్లాడుతూ.. సహాయ కార్యక్రమాల్లో రాజకీయాలు తగవని పేర్కొన్నారు. ఇది రాజకీయాలకు సమయం కాదన్న ఆయన సహాయ కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు. తక్కువ సమయంలో వీలైనంత మందికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.