ఆ ప్రశ్నలకు బదులేది?
ప్రధాని మోదీపై రాహుల్ ధ్వజం
సిల్చార్ (అసోం): ప్రధాని మోదీ తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ తప్పుబట్టారు. కీలక అంశాలపై తన ప్రశ్నలకు జవాబివ్వకుండా తప్పించుకున్నారన్నారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ ప్రధాని ఆనందం పొందారేతప్ప అసలు విషయాన్ని దాటవేశారని శుక్రవారం అసోంలోని సిల్చార్‌లో జరిగిన సభలో విమర్శించారు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునే పథకం, విదేశాలనుంచి నల్లధనం తీసుకురావడం, నాగా ఒప్పందం, మేకిన్ ఇండియా కింద ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారన్న ప్రశ్నలను మరోసారి గుర్తుచేశారు.
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బిహార్ పరిస్థితే వస్తుందని, బీజేపీ ఎక్కడికి వెళ్లినా అశాంతిని సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. తన ప్రసంగంలో రోహిత్ వేముల, కన్హయ్యకుమార్‌ల కోసం మోదీ ఒక్క క్షణం కూడా కేటాయించలేదని, దేశం అడుగుతున్న ప్రశ్నలకు సమాధానమివ్వడం అవసరం లేదని ప్రధాని భావించార ంటూ రాహుల్ తప్పుపట్టారు. ఆర్‌ఎస్‌ఎస్ భావాజాలన్ని రుద్దాలని ప్రయత్నిస్తున్నారని, దానిని ఎప్పటికీ అంగీచరించమన్నారు.
మోదీకి రాహుల్ ఫోబియా: కాంగ్రెస్
న్యూఢిల్లీ: రాహుల్ ఫోబియాలో మోదీ చిక్కుకున్నారని, వ్యంగ్య ప్రసంగంతో ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి విమర్శించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న దళిత, పేదల వ్యతిరేక విధానాలపై ఒక్కమాట మాట్లాడలేదని శుక్రవారం విలేకరుల సమావేశంలో సింఘ్వి తప్పుపట్టారు.