మెట్రో నగరాల్లో టాల్గో రైళ్లు!
న్యూఢిల్లీ: స్పెయిన్‌లో తయారయ్యే టాల్గో రైళ్లను మనదేశంలో ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ యోచిస్తోంది. టాల్గో రైలు ఆదివారం చివరిపరీక్షను ఎదుర్కొని ఢిల్లీ నుంచి ముంబైకి కేవలం 12 గంటల్లోనే చేరుకోవడం తెలిసిందే. ఈ రైలు భారత్‌లో విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తిచేసుకోవడంతో మెట్రో నగరాల మధ్య వీటిని ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ అనుకుంటోంది.
అయితే టాల్గో బోగీలను యథాతథంగా భారత్‌లో ప్రవేశపెట్టలేమనీ, మన దేశ అవసరాలు, ప్లాట్‌ఫాంల ఆకృతికి తగ్గట్టు స్వల్ప మార్పులు చేయాలని రైల్వే వర్గాలు తెలిపాయి. టాల్గో రైలు బోగీలు అల్యూమినియంతో తయారై, తక్కువ బరువు, ఎక్కువ వేగం కలిగి ఉంటాయి. ‘తేలికగా ఉండే అల్యూమినియం రైలు బోగీలను మన రైల్వేలో ప్రవేశపెట్టడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను మేం పరిశీలిస్తున్నాం’ అని రైల్వే బోర్డు సభ్యుడు హేమంత్ కుమార్ చెప్పారు. ఇప్పుడున్న పట్టాలపైనే రైళ్లను మరింత వేగంగా ఎలా నడపగలమో ఆలోచిస్తున్నామన్నారు.
ప్రస్తుత టాల్గో రైలుకు బోగీలు మాత్రమే స్పెయిన్ నుంచి వచ్చాయి. ఇంజిన్ భారతీయ రైల్వేదే వాడుతున్నారు. ఇప్పటికి గరిష్టంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో రైలును నడిపారు. బోగీల రవాణా ఖర్చును కూడా స్పెయినే భరించి బోగీలను ఇక్కడకు పంపింది.