
న్యూఢిల్లీ: రైలు బోగీల సంఖ్యలో ఏకరూపత తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అవసరమైనప్పుడు ఏ మార్గంలోనైనా ప్రయాణించడానికి వీలుగా అన్ని రైళ్లలో 22 బోగీలు అమర్చాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్లాట్‌ఫాంల పొడవు, ఇతర మౌలిక వసతుల్లో మార్పులు చేర్పులు చేస్తామని రైల్వే శాఖ మంత్రి పీయూశ్ గోయల్ మంగళవారం చెప్పారు.
ప్రస్తుతం రైలు నడిచే మార్గం, డిమాండ్ ఆధారంగా ఒక్కో బండిలో 12, 16, 18, 22, 26 చొప్పున బోగీలను అమర్చుతున్నారు. దీని వల్ల ఒక రైలు స్థానంలో మరో రైలును నడపడం సాధ్యం కావట్లేదు. ఏదైనా రైలు ఆలస్యమైనట్లయితే అందుబాటులో ఉన్న బండిని దాని స్థానంలో పంపేందుకు తాజా ప్రతిపాదన ఉపకరిస్తుందని రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు. తొలి దశలో ఈ మార్పులు చేయడానికి 300 రైళ్లను గుర్తించారు.