ద్వితీయార్ధంలో వర్షపాతం సాధారణమే
న్యూఢిల్లీ: ప్రస్తుత నైరుతి రుతుపవన కాలం ద్వితీయార్ధంలో సాధారణ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. జూన్– సెప్టెంబర్ మధ్య కురిసే సరాసరి వర్షపాతంతో పోలిస్తే ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వర్షపాతం వంద శాతం ఉండొచ్చని ఐఎండీ తెలిపింది. వర్షపాతం 94 నుంచి 104 శాతాల మధ్య నమోదైతే దానిని సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు. ఆగస్టులో సరాసరిలో 99% వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ఈ రుతుపవన కాలంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని గతంలో ఐఎండీ చెప్పడం తెలిసిందే. అయితే జూన్ 1–ఆగస్టు 7 మధ్య మూడు శాతం లోటు నమోదైంది. తత్ఫలితంగా దక్షిణ భారతంలో కరువు పరిస్థితులు నెలకొనగా ఉత్తర, ఈశాన్య భాగాల్లో మాత్రం భారీ వర్షాలు, వరదలు సంభవించాయి. పసిఫిక్ మహాసముద్రంపై ఎల్‌నినో ప్రభావం 2018 ఏప్రిల్ వరకు తటస్థంగానే కొనసాగనుందని ఐఎండీ తాజాగా చెప్పింది. ఆగస్టు, సెప్టెంబరుల్లో మంచి వర్షాలు కురిసేలాహిందూ మహా సముద్రంలోనూ పరిస్థితులు ఉన్నాయంది.