సీఎం రాజేకు షాక్
⇒ ముఖ్యమంత్రికి పట్టున్న ప్రాంతాల్లో కాంగ్రెస్ పాగా
⇒ రాజస్తాన్ స్థానిక ఎన్నికల్లో పుంజుకున్న హస్తం
⇒ ఈ ఎన్నికలు బీజేపీ సర్కారుపై అవిశ్వాసం లాంటివి: పైలట్
జైపూర్: రాజస్తాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యమంత్రి వసుంధరారాజేకు ఓటర్లు షాక్ ఇచ్చారు. ఈనెల 17న జరిగిన ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 129 మున్సిపాలిటీల్లో బీజేపీ 66 చోట్ల మెజారిటీ సాధించినప్పటికీ, ముఖ్యమంత్రి రాజే, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది.
గత లోక్‌సభ ఎన్నికల్లో మట్టికరిచిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో బాగా పుంజుకుంది. ఆ పార్టీ సుమారు 35 మున్సిపాలిటీల్లో దాదాపు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. 17 చోట్ల బీజేపీతో నువ్వానేనా.. అన్నట్టుగా పోటీనిచ్చింది. ఏడు మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్లు కీలకంగా మారారు. మొత్తం 3,351 వార్డులకుగాను బీజేపీ 1,443 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ 1,164 వార్డులను కైవసం చేసుకుంది.
సీఎం వసుంధరా రాజే ప్రాతినిధ్యం వహిస్తున్న జలావర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రెండు మున్సిపాలిటీల్లో మెజారిటీ సాధించింది. ఈ జిల్లాలో బీజేపీ మూడు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఇక ధోల్‌పూర్ జిల్లాలో ఉన్న మూడూ మున్సిపాలిటీలు బడీ, ధోల్‌పూర్, రాజఖేరాల్లో కాంగ్రెస్ మెజారిటీ సాధించింది. వసుంధర ధోల్‌పూర్ రాజ కుటుంబీకురాలు కావడం గమనార్హం. ఇక దుశ్యంత్‌సింగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే బరన్ జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో కూడా బీజేపీ మెజారిటీ కోల్పోయింది.
ప్రజలు కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు: పైలట్
ఈ ఫలితాలు రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాసం లాంటివని కాంగ్రెస్ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సచిన్‌పైలట్ అభివర్ణించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ఓట్లతేడా 26 శాతం ఉండగా, ఈ ఎన్నికల్లో అది ఒక శాతానికి తగ్గిపోయిందని ఆయన పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రికి ఓటర్లు తగిన గుణపాఠం చెప్పారని, ఇప్పుడు వారు కాంగ్రెస్‌వైపు చూస్తున్నారని పైలట్ మీడియాతో అన్నారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు.
పార్టీలు గెలుచుకున్న వార్డుల వివరాలు
బీజేపీ - 1,443
కాంగ్రెస్ - 1,164
ఎన్సీపీ - 19
బీఎస్పీ - 16
సీపీఐ - 5
సీపీఎం - 1
ఇండిపెండెంట్లు - 703.