రజనీ దారెటు?
* ఎన్నికలపై మౌనం
* అదే బాటలో అభిమాన సంఘాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘నా దారి రహదారి...బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే’..అంటూ తన డైలాగులతో వెండితెరపై ప్రత్యర్థులను దడదడలాడించే సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇంతకూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన దారెటో చెప్పనే లేదు. తమిళానాడులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జనాకర్షణ మెండుగా ఉండే సినీతారల మద్దతు కోసం అన్ని పార్టీలూ వెంపర్లాడుతాయి, వెంటపడతాయి. 1996 ఎన్నికల సమయంలో ఈ సినీ మోజు ఆకాశాన్ని అంటింది. తమిళనాడులో అత్యధిక జనాకర్షణ నటుల్లో ఆనాటి ఎంజీ రామచంద్రన్ తరువాత నేటి రజనీకాంత్ అని ఒప్పుకోక తప్పదు.
‘తమిళనాడును ఆ దేవుడు కూడా కాపాడలేడు’ అంటూ డీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్‌కు మద్దతుగా 1996లో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ప్రజలను తీవ్రస్థాయిలో ప్రభావితం చేశాయి. రజనీకాంత్ వ్యాఖ్యలతో ఆనాటి ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆనాటి నుండి నేటి వరకు ఎన్నికల సమయంలో అటువంటి చురుకైన వ్యాఖ్యానాలు రజనీ చేయలేదు. 2001, 2006, 2011లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రజనీకాంత్‌ను ప్రసన్నం చేసుకునేందుకు అనేక పార్టీలు ప్రయత్నించాయి.
అయితే రజనీకాంత్ తనదైన శైలిలో మౌనం పాటించారు. క్రమేణా డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య సమదూరం పాటించడం ప్రారంభించారు. 2014 పార్లమెంటు ఎన్నికల సమయంలో నరేంద్రమోదీ నేరుగా రజనీకాంత్ ఇంటికి వెళ్లి కలిసినా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా నోరు మెదపలేదు.
నేడు కూడా మౌనమేనా? ఇదిలా ఉండగా, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ వైఖరి ఏమిటనే చర్చ ఆయన అభిమానుల్లో నలుగుతోంది. 20 ఏళ్ల క్రితం డీఎంకే, తమాకా వలెనే నేడు పీఎంకే తరఫున ప్రయత్నాలు సాగిన సఫలం కాలేదు. రజనీకాంత్ ఆదేశాల మేరకు ఆయన అభిమానులు సైతం పార్టీల ఉచ్చులో పడకుండా జాగ్రత్తపడుతున్నట్లు సమాచారం. రజనీ దారెటు అని ఆయన అభిమాన సంఘం నేత ఒకరిని ప్రశ్నించగా, తమ ఓటు హక్కు వినియోగంపై ఆయన ఎలాంటి నిబంధన విధించలేదు, ఇష్టపడిన పార్టీకి ఓటు వేయండి అనే స్వేచ్ఛను ఇచ్చారని తెలిపాడు. తమ అభిమాన నేత రజనీకాంత్ మాత్రమే కాదు రాష్ట్రంలోని ప్రముఖ నటీనటులు ఎందరో మౌనం పాటిస్తున్నారని చెప్పాడు.