'మీ పిల్లలను ఆ వైపుగా వెళ్లకుండా చూడండి'
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అరుదైన ఘట్టానికి తెర తీశారు. ప్రలోభాలకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ముస్లిం యువకులను తమ సంస్థలోకి చేర్చుకుంటుండటాన్ని నివారించేందుకు ఆయన ముస్లింమత పెద్దలతో మంగళవారం సాయంత్రం ఢిల్లీలో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారి అజిత్ దోవల్, ఇతర హోంశాఖ ముఖ్య అధికారులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజ్ నాథ్ వారితో మాట్లాడుతూ ముస్లిం యువకులు ఉగ్రవాద సంస్థతల ప్రలోభాలకు తలొగ్గకుండా ఉంచేందుకు తమకు సహకరించాలని ముస్లిం పెద్దలను కోరారు. జమైతే ఉలేమా ఈ హింద్ కు చెందిన నేతలు మౌలానా అర్షద్ మదానీ, అజ్మీర్ షరీఫ్ మౌలానా అబ్దుల్ వహీద్ హుస్సేన్తోపాటు పలు ముస్లిం సంస్థల సహాయాన్ని కూడా రాజ్ నాథ్ కోరారు. మిగితా దేశాలతో పోలిస్తే భారత్ చాలా సురక్షితమైన దేశమని, ఇప్పుడిప్పుడే ఉగ్రవాద ముంపు ముంచుకొస్తున్నందున దాని భారిన పడకుండా ఉండేందుకు యువకులను వారి కుటుంబాలే చూడాలని చెప్పారు. మన దేశ కుటుంబ వ్యవస్థ గొప్పదని, అసాంఘిక చర్యలవైపు భారతీయ నైతికత వెళ్లనీయదని, యువకుల ఆలోచన కట్టడికి కుటుంబాలదే ప్రధాన పాత్ర అని కూడా ఆయన వారితో చెప్పినట్లు సమాచారం.