
శాశ్వత పరిష్కారం కనుగొన్నాం
కశ్మీర్ సమస్యకు ఎన్డీఏ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం కనుగొన్నదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అయితే దేశ ప్రాదేశిక సమగ్రతపై రాజీ ఉండదని స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: కశ్మీర్ సమస్యకు ఎన్డీఏ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం కనుగొన్నదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అయితే దేశ ప్రాదేశిక సమగ్రతపై రాజీ ఉండదని స్పష్టం చేశారు. వేర్పాటువాద గ్రూపులతో చర్చలు జరపబోమని తేల్చిచెప్పారు. ‘కశ్మీర్‌కు ఒక శాశ్వత పరిష్కారం కావాలి.. సంబంధిత ప్రక్రియ మొదలైంది. ఆ దిశగా ముందుకెళ్తున్నాం’ అని ఓ వార్తాసంస్థతో అన్నారు.
అయితే ఆ పరిష్కార వివరాలను వెల్లడించలేదు. రాజకీయ పరిష్కారం కనుగొన్నారా అని అడగ్గా.. ‘బహిరంగంగా చర్చించడం తొందరపాటు అవుతుంది. మీడియాతో చర్చించదలచుకోలేదు’ అని బదులిచ్చారు. కశ్మీర్‌పై సంబంధిత వర్గాలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధమేనని, అయితే దీని కోసం వ్యక్తులకు, గ్రూపుల ఆహ్వానాలు పంపబోమని రాజ్‌నాథ్ చెప్పారు. ఇది దశాబ్దాల సమస్య అని, లోయలో యువత తీవ్రవాద బాటపట్టడంతో ఆందోళనలు పెరిగాయని ఆయన పేర్కొన్నారు.