
‘ఎమర్జెన్సీ ఓ చీకటి అథ్యాయం’
సాక్షి, న్యూఢిల్లీ : భారత చరిత్రలో ఎమర్జెన్సీ విధించడం ఓ చీకటి అథ్యాయమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 1975లో జూన్ 25న ఎమర్జెన్సీ ప్రకటించి నేటికి 44 సంవత్సరాలైన సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ట్వీట్ చేశారు. 44 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజున సమాజంలో పౌర, రాజకీయ అశాంతిని కారణాలు చూపుతూ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించారని, పెద్దసంఖ్యలో విపక్ష నేతలు, సామాజిక కార్యకర్తలను జైళ్లలో నిర్బంధించారని గుర్తుచేశారు. మీడియాపై అణిచివేత వైఖరి ప్రదర్శించారని దుయ్యబట్టారు.
భారత్‌లో ఎమర్జెన్సీ ప్రకటన, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు భారత చరిత్రలో చీకటి అథ్యాయమని రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు. భారత పౌరులుగా నేడు మనం దేశ సమగ్రత, మన వ్యవస్థలు, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి కట్టుబడాలని వ్యాఖ్యానించారు. మరోవైపు దేశంలో ఎమర్జెన్సీ విధించినందుకు గాంధీ కుటుంబంపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా ధ్వజమెత్తారు. అధికారం కాపాడుకునేందుకు ప్రజాస్వామ్య వ్యవస్థను పణంగా పెట్టారని, ప్రజలు అమితంగా గౌరవించే రాజకీయ నేతలను జైల్లో పెట్టారని, కేవలం గాంధీ కుటుంబ ప్రయోజనం కోసమే ఇదంతా చేశారని ప్రధాని మండిపడ్డారు.