ఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశంలో విధించిన 'ఎమర్జెన్సీ' రోజులను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేసుకున్నారు. తనను 18 నెలల పాటు జైలులో పెట్టిన నాటి ప్రభుత్వం తన తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కూడా పెరోల్ ఇవ్వలేదన్నారు. బీజేపీపై కాంగ్రెస్ పార్టీ చేసిన 'నియంతృత్వ' ఆరోపణలపై స్పందింస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
వార్తా సంస్థ ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ బ్రెయిన్ హెమరేజ్‌తో మరణించిన తన తల్లి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయానని భావోద్వేగానికి గురయ్యారు. "ఎమర్జెన్సీ సమయంలో మా అమ్మ అంత్యక్రియలకు హాజరు కావడానికి నాకు పెరోల్ ఇవ్వలేదు. ఇప్పుడు వారు ( కాంగ్రెస్ ) మమ్మల్ని నియంతలు అంటున్నారు" అని ఆయన పేర్కొన్నారు.
ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించినప్పుడు రాజ్‌నాథ్ సింగ్ వయస్సు 24 సంవత్సరాలు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా 1977 మార్చి వరకు కొనసాగిన జేపీ ఉద్యమంలో మిర్జాపూర్-సోన్‌భద్రకు ఆయన కన్వీనర్‌గా పనిచేశారు. "అప్పుడు నాకు కొత్తగా పెళ్లైంది. రోజంతా కష్టపడి ఇంటికి వచ్చిన నన్ను అర్ధరాత్రి సమయంలో పోలీసులు జైలుకు తీసుకెళ్లారు. ఏకాంత నిర్బంధంలో ఉంచారు" అని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
ఒక సంవత్సరం జైలులో గడిపిన తరువాత, ఆయన్ను విడుదల చేస్తారా అని అడిగిన రాజ్‌నాథ్ సింగ్ తల్లికి ఎమర్జెన్సీని మరో సంవత్సరం పొడిగించారని బంధువు ఆమెకు తెలియజేశారు. ఆ దిగులుతో ఆమెకు బ్రెయిన్ హెమరేజ్ వచ్చి 27 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. తనకు పెరోల్ రాకపోవడంతో తల్లి అంత్య క్రియలకు వెళ్లలేకపోయానని, దీంతో తన సోదరులే అంత్యక్రియలు నిర్వహించారని వివరించారు. తాను జైలులోనే గుండు గీయించుకున్నానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment