రెచ్చిపోతే కఠినంగా వ్యవహరించండి: హైకోర్టు
సాక్షి, చంఢీఘర్ : డేరా స్వచ్ఛ సౌదా చీఫ్ గుర్మిత్ సింగ్ మద్దతు దారులపై హరియాణా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని శుక్రవారం ఆదేశించింది. రెచ్చగొట్టే ప్రసంగాలు ఎవరూ చేసినా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. శాంతి భద్రతలకు భంగం వాటిల్లితే ఉపేక్షించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయంతో రెండు రాష్ట్రాలు గడగడలాడుతున్నాయి.
లైంగిక వేధింపుల కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌పై సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుండడమే ఇందుకు కారణం. పంచకులలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మధ్యాహ్నం రెండున్నరకు తుది తీర్పు వెల్లడించినుంది. దీంతో హర్యాణా, పంజాబ్ నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. సాధారణంగా ప్రశాంతంగా ఉండే పంచ కులలో ఈ తీర్పు నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది
ఇక పంచకులకు గుర్మీత్ అభిమానులు తండోపతండాలుగా తరలి వచ్చారు. రహదారులపై ఎటువైపు చూసినా ఆయన మద్దతుదారులే కనిపిస్తున్నారు. వేలాదిగా వచ్చిన గుర్మీత్ అనుచరులు ఎక్కడికక్కడ తిష్ట వేసుకుని ఉన్నారు. ఇప్పటికే సుమారు రెండులక్షల మందికి పైగా నామ్ చర్చా ఘర్‌కు చేరుకోగా సమయం గడిచే కొద్దీ ఈ సంఖ్య పెరిగే అవకాశముంది.
అలాగే గుర్మీత్ మద్ధతు దారులు నిరసనలకు దిగారు. రోడ్లపై బైఠాయించి గుర్మీత్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కోర్టు తీర్పు గుర్మీత్‌కు వ్యతిరేంగా వస్తే అవాంఛనీయ సంఘటనలు జరిగే ప్రమాదముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. డేరా సచ్ఛా సౌధాలో భారీగా పెట్రోల్, డీజిల్ నిల్వ చేశారని, పదునైన ఆయుధాలు దాచి పెట్టారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
దీంతో హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పంచకులతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. పంచకుల, చండీఘర్ సహా ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు, పారామిలటరీ బలగాలను మోహరించారు. చండీగఢ్‌లోని క్రికెట్ స్టేడియాన్ని తాత్కాలిక జైలుగా మార్చి అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని స్టేడియంలోకి తరలించారు.
అలాగే పోలీసులకు అదనంగా ఇప్పటికే 15వేల పారా మిలిటరీ దళాలను మోహరించారు. ఒక్క పంచకులకే 177 కంపెనీల పారా మిలిటరీ దళాలను కేటాయించారు. సైన్యం కూడా పంచకులకు చేరుకుంది. రెండు రాష్ర్టాల్లోను 72 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. సిర్సా పట్టణం తోపాటు మరో మూడు గ్రామాల్లో నిరవధిక కర్ఫ్యూ కొనసాగుతోంది. పంజాబ్, హర్యానాల్లో కార్యాలయాలు, కార్పొరేషన్లు, ఏజెన్సీలు, ప్రభుత్వరంగ సంస్థలు మూతపడ్డాయి. పంజాబ్, హర్యానాలకు వచ్చే 29 రైళ్లను రద్దు చేశారు. బస్సు సర్వీసులు నిలిచిపోయాయి.
మరోవైపు కోర్టుకు హాజరయ్యేందుకు గుర్మిత్ సిర్సా నుంచి భారీ కాన్వాయ్‌తో పంచకుల బయల్దేరారు. ఈ కాన్వాయ్‌లో సుమారు రెండువందల వాహనాలు ఉన్నట్లు సమాచారం. అయితే తాము కేవలం రెండు వాహనాలను మాత్రమే పంచకులలోకి అనుమతి ఇస్తామని పోలీసులు చెబుతున్నారు.