బాబాపై రేప్ కేసు: అట్టుడుకుతున్న 2 స్టేట్స్!
చండీగఢ్: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా స్వచ్ఛ సౌదా చీఫ్ గుర్మీత్ రామ్‌రహీం సింగ్‌పై నమోదైన రేప్ కేసులో సీబీఐ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించబోతుండటంతో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లోనూ భారీగా పోలీసులు, పారా మిలటరీ బలగాలను మోహరించారు.
గుర్మీత్‌పై రేప్ కేసులో కోర్టు తీర్పు నేపథ్యంలో పంచకుల పట్టణానికి ఆయన మద్దతుదారులు పోటెత్తారు. ఇప్పటికే 30వేలమంది గుర్మీత్ మద్దతుదారులు పంచకులలోని ఆయన ఆశ్రమానికి చేరుకోవడం ఉత్కంఠ రేపుతోంది. గుర్మీత్ మద్దతుదారులు రాకుండా పోలీసులు ఎంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, తనిఖీలు చేస్తున్నా.. పెద్దసంఖ్యలో ఆయన అనుచరులు వస్తున్నట్టు తెలుస్తోంది. గుర్మీత్‌పై కోర్టు తీర్పు నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశముందని నిఘావర్గాలు భావిస్తున్నాయి. ఈ తీర్పు నేపథ్యంలో శాంతియుతంగా ఉండాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డేరా స్వచ్ఛ సౌదా మద్దతుదారులకు పిలుపునిచ్చారు.
2002లో ఇద్దరు మహిళా సాధ్వీలపై అత్యాచారానికి ఒడిగట్టినట్టు 'రాక్‌స్టార్ బాబా'గా పేరొందిన గుర్మీత్ రాంరహీం సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హర్యానాలోని సిర్సా శివార్లలో ఉన్న డేరా ప్రధాన కార్యాయలంలో తమపై లైంగిక దాడి జరిగిందని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. 2007లో విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు ఇద్దరు మహిళల నుంచి వాంగ్మూలం సేకరించింది. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను గుర్మీత్ ఖండించారు. పంచుకులలోని సీబీఐ కోర్టు శుక్రవారం ఈ కేసులో కీలక తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ఆయన మద్దతుదారులు పంచకులకు పెద్దసంఖ్యలో వస్తుండటంతో పోలీసులకు, నిఘా వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది. కోర్టు తీర్పు నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశముందని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు భావిస్తున్నాయి.