వీడియో విడుదల చేసిన డేరా స్వచ్ఛ సౌదా చీఫ్
న్యూఢిల్లీ : రేప్ కేసుపై కోర్టు తీర్పు నేపథ్యంలో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా స్వచ్ఛ సౌదా చీఫ్ గుర్మీత్ రామ్‌రహీం సింగ్ శుక్రవారం తన మద్దతుదారులకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పెద్ద సంఖ్యలో పంచకుల చేరుకున్న మద్దతుదారులంతా తిరిగి వారి ఇళ్లకు వెళ్లిపోవాలని సూచించారు. శాంతియుతంగా, సంయమనం పాటించాలని గుర్మీత్ రామ్‌రహీం సింగ్ పిలుపునిచ్చారు.
కాగా 2002లో ఇద్దరు మహిళా సాధ్వీలపై అత్యాచారానికి ఒడిగట్టినట్టు 'రాక్‌స్టార్ బాబా'గా పేరొందిన గుర్మీత్ రాంరహీం సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై పంచకులలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. కీలక తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో గుర్మిత్ రామ్‌రహీం సింగ్ మద్దతుదారులు పెద్దసంఖ్యలో పంచకుల చేరుకున్నారు. మరోవైపు పంచకుల కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ముందుజాగ్రత్త చర్యగా గుర్గాన్, ఫరిదాబాద్‌లో ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేశారు. అంతేకాకుండా శాంతిభద్రతల దృష్ట్యా 74 రైళ్లను రద్దు చేశారు.