ఘనంగా రంజాన్
భక్తిశ్రద్ధలతో జరుపుకున్న ముస్లింలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ముస్లింలు మంగళవారం రంజాన్ పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధలు, ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకున్నారు. ఈదుల్‌ఫితర్ సందర్భంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మసీదులు, ప్రార్థన మైదానాలు(ఈద్గాలు) జనంతో కిక్కిరిశాయి. భారీసంఖ్యలో భక్తులు ప్రార్థనలు నిర్వహించారు. బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలిపి కానుకలు ఇచ్చిపుచ్చుకున్నారు. విందుల్లో పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని జామా, ఫతేపురి తదితర మసీదులు జనంతో కిటకిటలాడాయి. జమ్మూ కాశ్మీర్‌లోని హజరత్‌బల్ మసీదులో 60 వేల మందితో నిర్వహించిన ప్రార్థనలో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, కోల్‌కతాలో 40 వేల మందితో నిర్వహించిన ప్రార్థనలో సీఎం మమతా బెనర్జీ పాల్గొన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ తదితరులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అత్తారీ-వాఘా, కాశ్మీర్‌లోని చకన్ బాగ్ సరిహద్దు చెక్‌పోస్ట్‌ల వద్ద భారత్, పాక్ జవాన్లు శుభాకాంక్షలు తెలుపుకుని మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నారు.
గోడకూలి ఇద్దరి మతి..: రంజాన్ పండుగ రోజున కొన్ని అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. గుజరాత్‌తో మెహసనా జిల్లాలో ఈద్గా ప్రహరీ కూలడంతో ఎనిమిదేళ్ల బాలుడు సహా ఇద్దరు చనిపోగా, 35 మందికిపైగా గాయపడ్డారు. గాజాపై ఇజ్రాయెల్ దాడుల పట్ల పలుచోట్ల ముస్లింలు నిరసన తెలిపారు. కాశ్మీర్‌లోని శ్రీనగర్, బారాముల్లాల్లో నిరసనకారులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఐదుగురు గాయపడ్డారు. చిన్న గొడవ వల్ల హింసతో అట్టుడికిన ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పుర్‌లో కర్ఫ్యూను సడలించడంతో ప్రార్థలు సజావుగా సాగాయి.