పంద్రాగస్టు వేడుకలకు వెళ్తుండగా దారుణం
చండీగఢ్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు పాఠశాలకు వెళ్తున్న బాలికను అపహరించి, అత్యాచారం చేసిన సంఘటన చండీగఢ్‌లో చోటుచేసుకుంది. ఉదయం 8.15 గంటలకు బాధితురాలు(12) చిల్డ్రన్స్ పార్కు దాటుతుండగా 40 ఏళ్ల వ్యక్తి ఆమెను అపహరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడని చండీగఢ్ సీనియర్ ఎస్పీ ఈష్ సింఘాల్ చెప్పారు. జరిగినదంతా బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు.
ఈ సంఘటన జరిగిన ప్రదేశమంతా దట్టమైన పొదలతో నిండి ఉందని సింఘాల్ వెల్లడించారు. మేజిస్ట్రేట్ ముందు బాలిక తన వాంగ్మూలాన్ని ఇచ్చిందని, నిందితుడితో తనకు పరిచయం లేదని పోలీసులకు చెప్పిం దని పేర్కొన్నారు. బాలికను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించామని చెప్పారు. నిందితుడిని గుర్తించేందుకు సమీప ప్రాంతం లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తామని వెల్లడించారు. బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది.