అగ్రిగోల్డ్ అక్రమాలపై రాష్ట్రపతి భవన్ సీరియస్గా స్పందించింది. గత ఏడాది డిసెంబర్లో అగ్రిగోల్డ్ బాధితుల తరఫున అండాల్ రమేష్ బాబు రాష్ట్రపతికి లేఖ రాశారు.
హైదరాబాద్ : అగ్రిగోల్డ్ అక్రమాలపై రాష్ట్రపతి భవన్ సీరియస్గా స్పందించింది. గత ఏడాది డిసెంబర్లో అగ్రిగోల్డ్ బాధితుల తరఫున అండాల్ రమేష్ బాబు రాష్ట్రపతికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆయన లేఖపై రాష్ట్రపతి భవన్ స్పందించింది. అగ్రిగోల్డ్ కేసులో ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకున్నారో పిటిషనర్కు చెప్పాలని ఆర్థికశాఖ, సెబీ, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీలకు రాష్ట్రపతి కార్యాలయం ఆదేశించింది. దీంతో పిటిషనర్ రమేష్ బాబు ఆయా శాఖల నుంచి సమాచారాన్ని లెటర్ ద్వారా అందుకున్నారు.
మరోవైపు అగ్రిగోల్డ్ కేసు విచారణలో జాప్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంలో మొదటి దశ ద్వారా రూ. 7.53 కోట్లు వచ్చినట్లు వేలం పర్యవేక్షణ కమిటీ నిన్న ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. అయితే మొదటి దశలో రూ. 40 కోట్లు వస్తాయని ఆశించామని కమిటీ తరఫు న్యాయవాది రవిప్రసాద్ తెలిపారు. రెండవ దశ వేలం ప్రక్రియ వచ్చే నెల 11, 12 తేదీల్లో మొదలవుతుందని, మూడో దశ వేలానికి రూ. 1,100 కోట్ల విలువ చేసే పలు ఆస్తులను గుర్తించామని ఆయన తెలిపారు.