
కళ్లు చెదిరే కుంభకోణం.. దొరికిపోయాడు
ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో కళ్లు విస్మయం చెందే కుంభకోణం బయటపడింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఓ డీలర్ భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డాడు. అసలు కుటుంబాలే లేని వాళ్ల పేరిట రేషన్ కార్డులు సృష్టించడమే కాకుండా అర్హత లేని వాళ్ల పేరిట కూడా వేలల్లో బియ్యం కార్డులు సృష్టించి ప్రభుత్వం నుంచి సబ్సిడీ సరుకులను తెప్పించి అక్రమాలకు పాల్పడ్డాడు.
ఎంత ఆశ్చర్యపోయే విషయమంటే అతడు కూరగాయలు, పండ్లు, అలానాటి బాలీవుడ్ చిత్రాల పాటల తొలి పంక్తుల్ని లబ్ధిదారులుగా పేర్కొన్నాడు. ఆగ్రాలోని ఫతేహబాద్ పరిధిలోని నిబోరా అనే గ్రామంలో పదమ్ సింగ్ అనే ఓ వ్యక్తి ఉన్నాడు. అతడు ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన పౌరసరఫరాల దుకాణం నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వ సొమ్మును కాజేసేందుకు ఏకంగా 350 గుర్తు తెలియని కుటుంబాల పేరిట రేషన్ కార్డులు తయారుచేశాడు.
వీటిల్లో కూరగాయలు, పండ్లు, అలానాటి బాలీవుడ్ చిత్రాల పాటల్ని కుటుంబ సభ్యులుగా పేర్కొన్నాడు. అంతేకాదు, 3,500 మంది అర్హతలేనివారిని లబ్ధిదారులుగా పేర్కొన్నాడట. ఒక రేషన్ కార్డులో మనోహర్ సింగ్(55) అనే వ్యక్తి బ్యాచిలర్ అని, అతడే కుటుంబ పెద్ద అని పేర్కొనడమే కాకుండా మరికొన్నిట్లో..లోకికి ఆలు తండ్రి అని, బిండీ తల్లి అని బాదం ఫాదర్ ఆప్ పిస్తా అని, సుఫారీ ఫాదర్ ఆఫ్ లాంగ్ అంటూ ఇలా చిత్ర విచిత్రమైన పేర్లను రేషన్ కార్డుల్లో పేర్కొన్నాడు. గత రెండేళ్లుగా ఈ కార్డులతో పదమ్ సింగ్ ప్రభుత్వ సొమ్మును కాజేయడం మొదలుపెట్టాడు. చివరకు అదే గ్రామానికి చెందిన భగవాన్ అనే వ్యక్తి ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చి అధికారులపైకి వత్తిడి చేయడంతో చర్యలు తీసుకునేందుకు అధికారులు కదిలారు.