కాంగ్రెస్ రెబల్స్‌పై వేటు
♦ ఉత్తరాఖండ్ సీఎం రావత్ శిబిరానికి ఊరట కలిగించిన స్పీకర్
♦ రాత్రి అత్యవసరంగా సమావేశమైన కేంద్ర మంత్రిమండలి
♦ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలపై చర్చ
♦ కేంద్రానికి నివేదిక పంపించిన గవర్నర్
♦ సీఎం హరీశ్‌పై ‘స్టింగ్’ వీడియో విడుదల చేసిన రెబల్ ఎమ్మెల్యేలు
♦ విశ్వాస పరీక్షకు ముందు మారుతున్న రాజకీయం
న్యూఢిల్లీ/ డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. శనివారం ఉదయం రెబల్ ఎమ్మెల్యేలు సీఎం హరీశ్ రావత్‌పై ‘స్టింగ్’ ఆపరేషన్ వీడియో విడుదల చేయగా.. రాత్రికల్లా ఆ తొమ్మిది మందిపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేసేశారు. అంతకుముందే రాష్ట్ర గవర్నర్ కేకే పాల్ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో పరిణామాలపై తన నివేదికను పంపించారు. అస్సాం ప్రచారానికి వెళ్లి తిరిగి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ అత్యవసరంగా తన మంత్రిమండలితో సమావేశమై గవర్నర్ నివేదికపై చర్చించారు. ఓపక్క కేబినెట్ సమావేశం జరుగుతుండగానే.. కాంగ్రెస్ ప్రతినిధి అంబికాసోనీ మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మోదీ సర్కారు కూటనీతిని అనుసరిస్తోందన్నారు. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు బట్టబయలయ్యాయని ఆమె విమర్శించారు. రెబల్ ఎమ్మెల్యేలపై చట్టప్రకారమే చర్యలు తీసుకున్నారని.. అయినా ఏదో జరిగినట్లు బీజేపీ రాద్ధాంతం చేస్తోందని ఆమె మండిపడ్డారు. గవర్నర్ నివేదికపై రాత్రి పొద్దుపోయేదాకా చర్చించిన కేంద్ర మంత్రి మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారన్న వార్తలు సశేషంగానే నిలిచిపోయాయి.
అయితే దీనిపై ఆదివారం కేంద్రం ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, కేంద్ర మంత్రిమండలి సమావేశం కొనసాగుతున్న సమయంలోనే డెహ్రాడూన్‌లో అసెంబ్లీ స్పీకర్ 9మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సోమవారం నాటి విశ్వాస పరీక్షకు సీఎం రావత్‌కు పెద్ద ఊరట లభించినట్లయిది. వేటు తర్వాత ప్రొగ్రెసివ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ సాయంతో కాంగ్రెస్‌కు కావాల్సిన బల నిరూపణ (మ్యాజిక్ ఫిగర్ 32)ను తేలిగ్గా చేరుకోనుంది. అంతకుముందు శనివారం మధ్యాహ్నం తిరుగుబాటు చేసిన అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని సీఎం హరీశ్ రావత్ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీ విప్‌ను ధిక్కరించి అసెంబ్లీలోనే బీజేపీ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారని ఆధారాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని ఆధారంగా నాటకీయ పరిణామాల మధ్యన స్పీకర్ వీరిపై వేటు వేస్తున్నట్లు ప్రకటించారు.
సీఎంపైనే స్టింగ్ ఆపరేషన్..: శనివారం ఉదయం తిరుగుబాటు ఎమ్మెల్యేలు సీఎం హరీశ్ రావత్‌పైనే అవినీతి ఆరోపణలు చేస్తూ ఓ వీడియో క్లిప్ మీడియాకు విడుదల చేశారు. విశ్వాస పరీక్షకు సహకరించాలంటూ సీఎం రావత్.. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు డబ్బులు ఎరవేసినట్లు ఈ వీడియో క్లిప్‌లో ఉండటం సంచలనం సృష్టించింది. అయితే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రావత్ పక్షాన నిలిచింది. సదరు వీడియో నకిలీదంటూ రావత్ ఖండించారు.
ఉత్తరాఖండ్‌లో బలాబలాలు: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మొత్తం 71 సీట్లున్నాయి. ఇందులో సాధారణ మెజారిటీకి కావాల్సిన 36 సీట్లు సరిగ్గా కాంగ్రెస్‌కున్నాయి. బీజేపీకి 28 స్థానాలు, స్వతంత్రులకు 6 స్థానాలుండగా.. ఒకరు నామినేటెడ్ ఎమ్మెల్యే. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయటంతో కాంగ్రెస్ బలం 27కు పడిపోయింది. ఈ సమయంలో విశ్వాస పరీక్ష ఎదుర్కుంటే ఓటమి తప్పదు. దీంతో తొమ్మిది మందిపై అనర్హత వేటు వేయటం ద్వారా 61 సీట్లకు గానూ.. బల నిరూపణకు 32 సీట్లు కాంగ్రెస్‌కు అవసరం. అయితే ఆరుగురు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మొత్తం కలిపితే.. కాంగ్రెస్ ఖాతాలో 33 సీట్లు ఉంటాయి. కాబట్టి మెజారిటీ చేరుకోవచ్చనేది అధికార పార్టీ వ్యూహం.