అస్సాంలో విదేశీయులపై ఆంక్షలు | Retricitons on Foreigners in Assam | Sakshi
Sakshi News home page

అస్సాంలో విదేశీయులపై ఆంక్షలు

Published Thu, Sep 5 2019 1:49 PM | Last Updated on Thu, Sep 5 2019 2:30 PM

Retricitons on Foreigners in Assam - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అస్సాంలో చేపట్టిన జాతీయ పౌరసత్వ తుది జాబితా (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్‌–ఎన్‌ఆర్‌సీ)పై వివాదం చెలరేగిన నేపథ్యంలో అస్సాంను కేంద్ర విదేశాంగ, హోం మంత్రిత్వ శాఖల పరిధిలో ‘ప్రొటెక్టెడ్‌ ఏరియా (రక్షిత ప్రాంతంగా)’ బుధవారం అధికారులు ప్రకటించారని, తక్షణం విదేశీ జర్నలిస్టులను రాష్ట్రం వదిలేసి వెళ్లాల్సిందిగా కూడా ఆదేశించారని ‘అస్సాం ట్రిబ్యూన్‌’ పత్రిక గురువారం వెల్లడించింది. రాష్ట్రం విడిచి విదేశీ జర్నలిస్టులు వెళ్లాలంటే అర్థం వారు రాష్ట్రంలో ఉండాలన్నా, రాష్ట్రంలో ఏ వార్తలు సేకరించాలన్నా ముందస్తుగా హోం శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ విషయం తెలియగానే అస్సాంలోని ‘అసోసియేటెడ్‌ ప్రెస్‌ (ఏపీ)’ జర్నలిస్ట్‌ బుధవారం రాష్ట్రం విడిచి స్వచ్ఛందంగా వెళ్లిపోయినట్లు అస్సాం ట్రిబ్యూన్‌ తెలియజేసింది. అస్సాం పోలీసులు ఆయన్ని వెన్నంటి విమానాశ్రయం వరకు సాగనంపి ఢిల్లీ విమానాన్ని ఎక్కించినట్లు కూడా పేర్కొంది. అస్సాంలో ఇటీవల ఎఆర్‌సీని సవరించినప్పటికీ ఇంకా 19 లక్షల మంది పేర్లు గల్లంతయినట్లు తెల్సిందే. అంటే వీరంతా ట్రిబ్యునల్‌ ముందు హాజరై తాము విదేశీయులం కాదని, భారతీయులమని నిరూపించుకోవాలి. అలా జరగనట్లయితే వారంతా దశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అస్సాంను ‘రక్షిత ప్రాంతం’గా ప్రకటించారు.

అస్సాంలో ఎన్‌ఆర్‌సీ పట్ల కేంద్రం అనుసరిస్తోన్న విధానాన్ని కొన్ని విదేశీ పత్రికలు విమర్శించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక అధికారులు తెలియజేశారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న విదేశీ జర్నలిస్టులు స్థానిక వార్తలను కవర్‌ చేయాలన్నా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న విదేశీ జర్నలిస్టులు అస్సాంలోకి రావాలన్నా ముందస్తుగా విదేశాంగ శాఖ లేదా హోం శాఖ అనుమతి తీసుకోవాలని వారు సూచించారు. అయితే పాప్‌ (పీఏపీ–ప్రొటెక్టెడ్‌ ఏరియా పర్మిట్‌)గానీ, రాప్‌ (ఆర్‌ఏపీ–రిస్ట్రిక్డెడ్‌ ఏరియా పర్మిట్‌)గానీ తాము జారీ చేయడం లేదని కూడా వారు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటించినందున విదేశీ జాతీయులు, విదేశీ పర్యాటకులు కూడా రాష్ట్రాన్ని సందర్శించాలంటే ముందస్తు అనుమతి ఉండాల్సిందేనని స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా అనుమతి కోరవచ్చని కూడా వారు సూచించారు.  ప్రస్తుతం కశ్మీర్‌లో కూడా ఇలాంటి ఆంక్షలే కొనసాగుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement