బెంగళూరు : వరుణుడి ప్రతాపానికి కర్ణాటక కూడా చిగురుటాకులా వణుకుతోంది. ముంచెత్తుతున్న వరదలతో సర్వస్వం కోల్పోయి సహాయక శిబిరాల్లో తల దాచుకుంటున్నారు కర్ణాటక వాసులు. వరద బాధితులను పరామర్శించడానికి వచ్చి మంత్రిగారు చేసిన పనిపై జనాలు తీవ్రంగా మండిపడుతున్నారు.
వివరాల ప్రకారం.. కర్ణాటక పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రి, మాజీ ప్రధాని దేవేగౌడ కుమారుడు హెచ్‌డీ రేవన్న ఆదివారం సాయంత్రం హసన్ జిల్లా, రామాంతపూర సహాయ శిబిరాల్లో ఉన్న బాధితులను సందర్శించేదుకు వచ్చారు. జనాలతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్న రేవన్న అనంతరం అక్కడ ఉన్న ప్రజల మీదకు బిస్కెట్ ప్యాకెట్లను విసిరారు. మంత్రి చర్యలకు విస్తుపోయిన జనాలు ఆ బిస్కట్ ప్యాకెట్లను తీసుకోలేదు. అంతేకాక ‘మేము జంతువులం అనుకుంటున్నావా. కనీస మర్యాద లేకుండా బిస్కెట్ ప్యాకెట్లను విసురుతున్నావు’ అంటూ రేవన్నను విమర్శించారు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ విషయం గురించి రేవన్న ‘నేను కాస్తా పని తొందరలో ఉండి అలా చేయాల్సి వచ్చింది. కానీ ప్రతిపక్ష బీజేపీ పార్టీ మాత్రం ఈ చర్యను అమానవీయ రీతిలో ప్రచారం చేస్తోంది’ అంటూ మండి పడ్డారు. కొడుగు, హసన్ జిల్లాల్లో భారీ వరదలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో రేవన్ననే ముందు స్పందించారు. వరద బాధితులను ఆదుకోవడానికి పాల ట్యాంకర్లను, ఆహార పదార్థాలను కొడుగు జిల్లాకు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment