బాధితురాలిని పరీక్షిస్తున్న ఎయిమ్స్ నిపుణులు
లక్ష శస్త్ర చికిత్సలు చేసినందుకు పురస్కారం
బిలాస్‌పూర్ ఘటనలో 13కి చేరిన మృతుల సంఖ్య!
రాయిపూర్/బిలాస్‌పూర్: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో 11 మంది మహిళల మృతికి కారణమైన కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహించిన డాక్టర్ ఆర్‌కే గుప్తా.. తన వృత్తి జీవితంలో ఒక లక్ష కు.ని ఆపరేషన్లు చేసినందుకు ఈ సంవత్సరం అవార్డ్ కూడా అందుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న సాక్షాత్తూ రాష్ట్ర ఆరోగ్యమంత్రి చేతుల మీదుగా ఆ డాక్టర్ పురస్కారం స్వీకరించారు. బిలాస్‌పూర్‌లో నవంబర్ 8న ఆయన 5 గంటల వ్యవధిలో 83 కు.ని ఆపరేషన్లు చేశారు.
ఇది ఒకరోజులో చేయాల్సిన ఆపరేషన్ల సంఖ్య కన్నా రెండురెట్లు ఎక్కువ. ఆ సమయంలో ఆయనకు సహాయంగా ఒక్కరే ఉన్నారని, సర్జరీల సమయంలో పరిశుభ్రమైన పరికరాలు ఉపయోగించలేదని సమాచారం. అదీకాక, ఆపరేషన్లు నిర్వహించిన ఆసుపత్రిలోనూ సరైన సదుపాయాలు కూడా లేవు. ఒక్కో ఆపరేషన్‌కు ఆ డాక్టర్‌కు రూ. 100 లభిస్తాయి. మరో సంవత్సరంలో పదవీ విరమణ చేయనున్న డాక్టర్ గుప్తాపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
బాధితులకు ఎయిమ్స్ వైద్యుల పరీక్షలు
చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న దాదాపు 69 మంది మహిళలను బుధవారం ఢిల్లీ నుంచి వచ్చిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ వైద్యులు(ఎయిమ్స్) పరీక్షించారు. బాధితులకు సరైన చికిత్సనే అందుతోందని ఎయిమ్స్‌లో అనస్థీసియా ప్రొఫెసర్ డాక్టర్ అంజన్ ట్రిఖా తెలిపారు. కాగా, బిలాస్‌పూర్ ఘటనలో మరణించినవారి సంఖ్య బుధవారం నాటికి 13కి చేరిందని, సుమోటొగా స్వీకరించిన హైకోర్టు బిలాస్‌పూర్ ఘటనను బుధవారం చత్తీస్‌గఢ్ హైకోర్టు సుమోటొగా స్వీకరించింది. ఇలాంటివి తరచుగా ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నిస్తూ.. ఆ ఘటనపై 10 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.