సాక్షి, ముంబై: ఇటీవల వాంఖడే స్టేడియంలో జరిగిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో ప్రధాని భద్రతను చేధించుకుని వేదికపైకి వచ్చిన వ్యక్తిని మెరైన్ డ్రైవ్ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. అతడిపై అక్రమ చొరబాటు తదితర కేసులు నమోదు చేశారు. అక్టోబరు 31న సాయంత్రం వాంఖ డే స్టేడియంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సహా పది మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం జరిగిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు అనేక మంది వీవీఐపీలు వేదికపై ఆసీనులయ్యారు. కాగా, అనిల్ మిశ్రా అనే వ్యక్తి కొంతసేపు వేదికపై హడావుడిగా తిరిగాడు. పీఎం, సీఎంలకు అతి దగ్గరగా వెళ్లి వారితో నిలబడి తన వ్యక్తిగత కెమెరామెన్‌తో ఫొటోలు తీయించుకున్నాడు. ఆ సమయంలో ఎవరూ మిశ్రాను అంతగా పట్టించుకోలేదు. అయితే, తర్వాత వీడియో ఫుటేజ్‌లను చూసిన బీజేపీ నాయకుల మధ్య అతడు ఎవరనే విషయంపై చర్చ జరిగింది.
దీంతో ఆరా తీయగా అతను మలాడ్ ప్రాంతానికి చెందిన వాడని, అయితే అతనివద్ద వీవీఐపీ పాస్ లేదని, కేవలం వీఐపీ పాస్ ఉందని తెలిసింది. ప్రొటోకాల్ ప్రకారం వీవీఐపీలు మినహా ఇతరులెవరూ వేదికపైకి వెళ్లరాదు. ప్రముఖులకు అతి దగ్గరగా నిలబడే వీలు కూడా లేదు. కాని మిశ్రా భద్రత సిబ్బంది కళ్లుగప్పి మోదీకి, ఫడ్నవిస్‌కు అతి దగ్గరగా వెళ్లాడు. దీంతో అతనిపై కేసు నమోదుచేసి కోర్టులో శనివారం హాజరుపర్చగా ఈ నెల 11వ తేదీ వరకు పోలీసు కస్టడిలో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు.
‘ప్రొటోకాల్’ పాటించని వ్యక్తి అరెస్టు
Published Sat, Nov 8 2014 11:28 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement