న్యూఢిల్లీ: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆస్పత్రులలో రోబోలను ఉపయోగించేందుకు పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. మనుషులు వెళ్లలేని, వెళ్లకూడని చోట్లకు రోబోలను పంపి విధులు నిర్వర్తించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కరోనా సోకిన వారికి మందులు అందించడంతో పాటుగా, ఆస్పత్రులను శుభ్రం చేసేందుకు రోబోలు ఉపయోగపడుతున్నాయి. గతేడాది చివర్లో చైనాలోని వూహాన్‌లో వైరస్ వెలుగు చూసినపుడు అక్కడి ఆస్పత్రులలో రోబోలనే వాడారు. రోగుల శరీర ఉష్ణోగ్రతను కొలిచేందుకు, మందులు అందించేందుకు, రోగి ఉన్న ప్రాంతాలను శుభ్రం చేసేందుకు అవి సహాయపడ్డాయి. రోగి ముక్కు, గొంతు నుంచి టెస్ట్ శాంపిళ్లను సేకరించడానికి రోబోలు ఉపయోగపడతాయని అమెరికాకు చెందిన కార్నిగే మెలాన్ యూనివర్సిటీ నిపుణులు తేల్చారు.
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ ఆస్పత్రిలో అతినీలలోహితక కాంతితో చేసే క్లీనింగ్ పనిని రోబో కేవలం 10నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రోబోలు కీలక పాత్ర పోషించగలవని పంజాబ్ లవ్లీ యూనివర్సిటీకి చెందిన డీన్ లోవి రాజ్ గుప్తా తెలిపారు. ‘రోబోలు అన్ని స్థాయిల్లోనూ మానవ ప్రమేయాన్ని తగ్గిస్తాయి. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న ఈ కాలంలో అవి మరింత ఉపయోగపడగలవు. రోగులకు కావాల్సిన వాటిని అందించగలవు’ అని పేర్కొన్నారు. కరోనా రోగుల కోసం వైద్యులు రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారని, వారికి కరోనా సోకకుండా రోబోలను వినియోగించుకోవచ్చని అదే యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ అనిత గెహ్లోత్ అన్నారు.
మన దేశంలో..
రోగులకు దూరంగా ఉంటూ చికిత్స అందించడంలో రోబోలు భారత వైద్యులకు ఉపకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా వైద్యులకు చికిత్సతో పాటుగా ఆహారం, మందులు అందించేందుకు హ్యూమనాయిడ్ రోబోలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. దీనివల్ల వైద్యులకు, వైద్య సిబ్బందికి వైరస్ సోకే ముప్పు గణనీయంగా తగ్గుతుందని ఆస్పత్రి అధికారులు తెలిపారు. కేరళకు చెందిన స్టార్టప్ కంపెనీ నిపుణులు ఐసోలేషన్‌లోని రోగులకు వైద్యం అందించేందుకు రోబోను తయారు చేశారు. అది రోగి గదిలోకి మందులు, ఆహారాన్ని తీసుకెళ్లగలదు.
రోబోలతో వైరస్ పని పట్టు
Published Tue, Mar 31 2020 5:59 AM | Last Updated on Tue, Mar 31 2020 5:59 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment