మహారాష్ట్ర గవర్నర్‌పై దాడి
* అసెంబ్లీలోకి రాకుండా విద్యాసాగర్‌రావును అడ్డుకున్న విపక్షాలు
* తోపులాటలో గవర్నర్ చేతికి స్వల్ప గాయాలు
* ఐదుగురు కాంగ్రెస్ సభ్యులపై రెండేళ్లపాటు సస్పెన్షన్
* విశ్వాసపరీక్షలో మూజువాణి ఓటుతో నెగ్గిన బీజేపీ సర్కార్
సాక్షి, ముంబై: మహారాష్ర్ట అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుపై బుధవారం దాడి జరిగింది. అసెంబ్లీలో జరిగిన తోపులాటలో గవర్నర్ చేతికి స్వల్ప గాయాలయ్యాయి. అంతకుముందు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సందర్భంగా జరిగిన విశ్వాసపరీక్షలో మూజువాణి ఓటుతో దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గట్టెక్కింది. అయితే సర్కారు వ్యవహరించిన తీరుపై విపక్ష శివసేన, కాంగ్రెస్ సభ్యుల ఆందోళనలతో అసెంబ్లీ అట్టుడికింది. మరోవైపు గవర్నర్‌పై దాడికి కారణమైన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను స్పీకర్ రెండేళ్లపాటు సస్పెండ్ చేశారు.
అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు
అంతకుముందు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య మహారాష్ర్ట కొత్త సర్కారు ఒడ్డునపడింది. తొలుత సభ విశ్వాసాన్ని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యే ఆశిష్ శేలార్ ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. శివసేన, కాంగ్రెస్ డివిజన్ ఓటింగ్‌కు పట్టుబట్టినా మూజువాణి ఓటుతోనే తీర్మానానికి ఆమోదం లభించినట్లు స్పీకర్ హరిభావ్ బాగ్డే ప్రకటించారు. దీంతో శివసేన సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. పోడియంలోకి దూసుకెళ్లి.. డివిజన్ ఓటింగ్‌కు పట్టుబట్టారు. వీరికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తోడయ్యారు. మూజువాణి ఓటుతో విశ్వాసపరీక్షను నెగ్గి ప్రజాస్వామ్యాన్ని బీజేపీ సర్కారు ఖూనీ చేసిందని ప్రధాన ప్రతిపక్ష నేత ఏక్‌నాథ్ షిండే మండిపడ్డారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని హితవుపలికారు.
దీనికి సీఎం ఫడ్నవిస్ స్పందిస్తూ.. ప్రతిపక్షమైనంత మాత్రాన ప్రతి విషయాన్నీ వ్యతిరేకించకూడదని, ప్రజాక్షేమం కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మద్దతు తెలపాలని సూచించారు. మరోవైపు బీజేపీ సర్కారుకు బయటినుంచి మద్దతు ప్రకటించిన ఎన్సీపీ ఎమ్మెల్యేలు.. సభలో గొడవ జరుగుతున్నంతసేపూ తమ సీట్లోనే కదలకుండా కూర్చున్నారు. విపక్షాల ఆందోళనతో సభ కొంతసేపు వాయిదా పడింది. నిజానికి డివిజన్ ఓటింగ్ పెట్టినప్పటికీ ప్రభుత్వం సులభంగానే నెగ్గేది. ప్రస్తుతం 287 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీకి 121 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా, మిత్రపక్షం ఆర్‌ఎస్పీకి ఒక ఎమ్మెల్యే, ఎన్సీపీకి 41 మంది సభ్యులు ఉన్నారు. ఏడుగురు స్వతంత్రులు, చిన్నపార్టీలకు చెందిన పలువురి మద్దతు ఉంది.
గవర్నర్ వద్దకు వెళతాం: శివసేన, కాంగ్రెస్
ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని విపక్షాలు వెల్లడించాయి. మళ్లీ ఓటింగ్ నిర్వహించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌ను కోరనున్నట్లు తెలిపాయి. ప్రజాస్వామ్య ప్రక్రియలో దీన్ని బ్లాక్ డేగా కాంగ్రెస్ నేత, మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ అభివర్ణించారు. డివిజన్ ద్వారా మెజారిటీని నిరూపించుకునే వరకు ఈ ప్రభుత్వం అక్రమంగా కొనసాగుతున్నట్టే భావిస్తామన్నారు. మైనారిటీ ప్రభుత్వం డివిజన్ ద్వారానే బలాన్ని నిరూపించుకోవాలని రాష్ర్ట కాంగ్రెస్ అధ్యక్షుడు మానిక్‌రావు థాక్రే అన్నారు. కాగా, కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ మద్దతుదారులైన 40 మంది ఎమ్మెల్యేలు విశ్వాసపరీక్షలో సర్కారుకు వ్యతిరేకంగా ఓటు వేసేవారని శివసేన ఎమ్మెల్యే రాందాస్ కదం పేర్కొన్నారు. అందుకే ముందస్తు వ్యూహం ప్రకారమే మూజువాణి ఓటుతో ప్రభుత్వం బయటపడిందని విమర్శించారు. ధైర్యముంటే మరోసారి విశ్వాస పరీక్ష నిర్వహించి మెజారిటీ రుజువు చేసుకోవాలని సవాల్‌విసిరారు. స్పీకర్‌కు వ్యతిరేకంగా అవిశ్వా స తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై ఇతర పక్షాలతో చర్చిస్తామని కూడా రాందాస్‌తో పాటు, కాంగ్రెస్ నేత భాయ్ జగ్‌తాప్ తెలిపారు. అయితే డివిజన్ ఓటింగ్ డిమాండ్‌ను విపక్షాలు ఆలస్యంగా తనముందుకు తెచ్చాయంటూ.. స్పీకర్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.
గవర్నర్ రాకతో తోపులాట
విశ్వాసపరీక్ష తర్వాత ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడానికి గవర్నర్ విద్యాసాగర్‌రావు అసెంబ్లీ ప్రాంగణానికి రావడంతో ప్రతిపక్షాలు ఆయనకు అడ్డుకున్నాయి. సభలోకి ప్రవేశించకుండా అసెంబ్లీ మెట్ల వద్దే పలువురు సభ్యులు భైఠాయించారు. మరికొందరు ఆయన కారును అడ్డుకున్నారు. విద్యాసాగర్‌రావు చలే జావ్ అంటూ శివసేన ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. కారు దిగి లోపలికి వెళుతుండగా విద్యాసాగర్‌రావును చుట్టుముట్టిన కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తోపులాటకు దిగారు. దీంతో భద్రతా సిబ్బంది వారిని బలవంతంగా పక్కకు తీసుకె ళ్లారు. ఈ పెనుగులాటలో గవర్నర్ చేతికి గాయమైంది. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను అధికారపక్షం కోరింది. కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను రెండేళ్ల పాటు సస్పెండ్ చేయాలని బీజేపీకి చెందిన ఏక్‌నాథ్ ఖడ్సే ప్రతిపాదించారు. ఈ వివాదానికి ఇంతటితో తెరదించాలని స్పీకర్‌ను ప్రతిపక్ష నేత ఏక్‌నాథ్ షిండే, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత రాధాకృష్ణ విఖే పాటిల్ కోరారు. అయినా గవర్నర్‌కు గాయాలవడాన్ని తీవ్రంగా పరిగణించిన స్పీకర్ కాంగ్రెస్ సభ్యులు వీరేంద్ర జగ్తాప్, రాహుల్ బోంద్రే, జైకుమార్ గోరే, అబ్దుల్ సత్తార్, అమర్ కాళేలను రెండేళ్ల పాటు సస్పెండ్ చేశారు.
పారదర్శక పాలన అందిస్తాం: గవర్నర్
మహారాష్ట్ర ప్రజలు మార్పును కోరుకున్నట్టు ఇటీవలి ఎన్నికల్లో వెలువడ్డ ప్రజాతీర్పే నిదర్శనమని గవర్నర్ విద్యాసాగర్‌రావు తన ప్రసంగంలో పేర్కొన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలను కొత్త ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఆర్థిక లోటు, కరెంటు సరఫరా, మౌలిక వసతుల లేమి తదితర ఎన్నో సవాళ్లను రాష్ట్రం ఎదుర్కొంటోందన్నారు. తమ ప్రభుత్వం నిర్ణీత సమయంలో, పారదర్శక రీతిలో ప్రజలకు సేవలు అందించేందుకు కట్టుబడి ఉందని చెప్పారు. త్వరలోనే ప్రభుత్వ సేవల గ్యారంటీ చట్టాన్ని తీసుకువస్తామని పేర్కొన్నారు. అధికారాలను వికేంద్రీకరించి ప్రజలే కేంద్రంగా పాలన అందిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా వంద రోజుల్లో తమ ప్రభుత్వం ‘అపాలే సర్కార్’ పేరుతో ఇ-పోర్టల్‌కు రూపకల్పన చేస్తుందన్నారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా కూడా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ప్రతిపక్షాలు హోరెత్తించాయి.
ఏకగ్రీవంగా స్పీకర్ ఎన్నిక
విశ్వాసపరీక్షకు ముందు అసెంబ్లీ స్పీకర్‌గా బీజేపీ నేత హరిభావ్ బాగ్డేను సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
దమ్ముంటే అవిశ్వాసాన్ని పెట్టండి: ఫడ్నవిస్
ప్రభుత్వం విశ్వాస పరీక్షను అక్రమంగా నెగ్గిందన్న విపక్షాల ఆరోపణను సీఎం ఫఢ్నవిస్ తోసిపుచ్చారు. తీర్మాన ఆమోదంలో నిబంధనలన్నీ పాటించామని విలేకర్లతో అన్నారు. కాంగ్రెస్, శివసేనలు సరైన సమయంలో డివిజన్ ఓటింగ్‌కు డిమాండ్ చేసి ఉంటే అందుకంగీకరించి ఉండేవారిమన్నారు. విపక్షాలకు దుమ్ముంటే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని సవాల్ విసిరారు. తన ప్రభుత్వానికి మెజారిటీ ఉంది కనుక ఆ తీర్మానాన్ని నెగ్గుతామన్నారు. తన ప్రభుత్వం ఎన్సీపీ మద్దతును నిరాకరించడం కానీ స్వీకరించడం కానీ చేయలేదన్నారు.