
యూపీలో 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో పాలక బీజేపీ పలు స్ధానాల్లో ముందంజలో ఉంది.
లక్నో : ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిన 11 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో పాలక బీజేపీ ముందంజలో ఉంది. బీజేపీ ఆరు స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా విపక్ష ఎస్పీ రెండు స్ధానాల్లో బీఎస్పీ, కాంగ్రెస్‌లు ఒక్కో స్ధానంలో ముందంజలో ఉన్నాయి. ఉప ఎన్నికలు జరిగిన 11 స్ధానాల్లో ఎనిమిది స్ధానాలు బీజేపీ ప్రాతినిథ్యం వహిస్తున్నవే కావడం గమనార్హం. ఎస్పీ, బీఎస్పీలు చెరోస్ధానంలో ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. ఎస్పీ రాంపూర్ స్ధానాన్ని, బీఎస్పీ జబల్‌పూర్ స్ధానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రతిష్టాత్మకంగా పోరాడుతున్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 300కిపైగా స్ధానాలతో క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీ ఈనెల 21న జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మొత్తం 11 స్ధానాలను గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేసింది. 11 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు బీజేపీ 10 స్ధానాల్లో పోటీచేయగా, ఒక స్ధానం మిత్రపక్షం అప్నాదళ్‌కు కేటాయించింది.