
జైశంకర్, విజయ్ గోఖలే
న్యూఢిల్లీ: అమెరికా–భారత్ పౌర అణు ఒప్పందంతో పాటు ఇండియా–చైనాల మధ్య నెలకొన్న డోక్లామ్ సమస్యను సామరస్యంగా పరిష్కరించడంలో కీలకంగా వ్యవహరించిన విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ ఆదివారం పదవీవిరమణ చేశారు. మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న జైశంకర్.. గత నాలుగు దశాబ్దాల్లో అత్యధిక కాలం విదేశాంగ కార్యదర్శిగా కొనసాగిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ప్రధాని మోదీ 2015, జనవరి 28న విదేశాంగ కార్యదర్శిగా జైశంకర్‌ను నియమించారు.
జైశంకర్ స్థానంలో చైనా వ్యవహారాల్లో నిపుణుడైన 1981 ఐఎఫ్‌ఎస్ అధికారి విజయ్ కేశవ్ గోఖలే సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. మోదీ ఇజ్రాయెల్ పర్యటనతో పాటు సీషెల్స్‌కు చెందిన ఓ దీవిలో మిలటరీ సౌకర్యాల అభివృద్ధికి చేసే ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవడంలో జైశంకర్ కీలకపాత్ర పోషించారు. 1977 ఐఎఫ్‌ఎస్ అధికారి అయిన జైశంకర్ నాలుగున్నరేళ్ల పాటు చైనాలో భారత రాయబారిగా పనిచేశారు. 2013లో అమెరికాలో భారత రాయబారిగా ఎం పికైన తర్వాత ఐఎఫ్‌ఎస్ అధికారిణి దేవయాని ఖోబ్రగడే ఉదంతంపై ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు కృషి చేశారు.