
చైనాకు నేరుగా విమాన సర్వీసులు
సంబంధాల బలోపేతానికి చర్యలు
జల వనరుల సమాచార మార్పిడి
మిస్రీ పర్యటనలో కీలక ఒప్పందాలు
మంత్రులతో వరుస భేటీలు, చర్చలు
న్యూఢిల్లీ: భారత్–చైనా సంబంధాల మెరుగుదల దిశగా మరిన్ని కీలక అడుగులు పడ్డాయి. ఈ వేసవి నుంచి కైలాస మానస సరోవర యాత్ర పునఃప్రారంభం కానుంది. ఇరుదేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను కూడా పునరుద్ధరించనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బీజింగ్ వెళ్లిన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ సోమవారం చైనా విదేశాంగ శాఖ ఉప మంత్రి సన్ వెయ్‌డాంగ్‌తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు జరిగాయి. ఒప్పందాలు కుదిరాయి. అంతర్జాతీయ నదుల విషయమై పరస్పరం మరింతగా సహకరించుకునేందుకు, జల వనరులకు సంబంధిత డేటాను పూర్తిస్థాయిలో ఇచ్చిపుచ్చుకునేందుకు ఇరు దేశాలూ అంగీకరించాయి. భారత్–చైనా నిపుణుల స్థాయి బృందం దీనిపై వీలైనంత త్వరగా చర్చలు జరపనుంది.
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, చైనా కమ్యూనిస్టు పార్టీ అంతర్జాతీయ శాఖ మంత్రి లియూ జియాంచవోలతోనూ మిస్రీ సమావేశ మయ్యారు. పలు కీలకాంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తీసుకున్న పలు నిర్ణయాలను విదేశాంగ శాఖ వెల్లడించింది. ‘‘ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు ఉన్నతస్థాయిలో చర్చలు జరపాలని గత అక్టోబర్‌లో కజాన్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీలో నిర్ణయించడం తెలిసిందే.
తాజా చర్చలు అందులో భాగమే’’ అని వివరించింది. ‘‘ఇరుదేశాల దౌత్య బంధానికి 75 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా విశ్వాస కల్పనకు మరిన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయం జరిగింది. ఆర్థిక, వర్తక రంగాల్లో ఇరుదేశాల్లో నెలకొన్న పరస్పర ఆందోళనలు, సందేహాలు కూడా సన్–మిస్రీ చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. దీర్ఘకాలిక ప్రాతిపదికన విధాన పారదర్శకత, విశ్వసనీయతే గీటురాళ్లుగా ముందుకు సాగాలని అంగీకారం కుదిరింది’’ అని వెల్లడించింది. మానస సరోవర యాత్ర, చైనాకు నేరుగా విమాన సర్వీసులు 2020లో రద్దయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment