వన్యప్రాణులను వేటాడిన ఉదంతంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు రాజస్తాన్ లోని జో«ద్‌పూర్ కోర్టు గురువారం అయిదేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ సమయంలో సల్మాన్‌తో పాటున్న సహ నటీనటులందరినీ నిర్దోషులుగా భావించి కోర్టు విడుదల చేసింది. ఆయనపై దాఖలైన కేసుల పరంపరలో ఇది చివరిది. ఇరవైయ్యేళ్ల క్రితం... అంటే 1998 అక్టోబర్‌లో చిత్రం షూటింగ్ కోసం జోద్‌పూర్ అడవులకొచ్చిన ఈ నటీనటులంతా అర్ధరాత్రి సమయంలో వన్యప్రాణులను వేటాడారన్నది అభి యోగం. అందుకు సంబంధించి మూడు కేసులు దాఖలు కాగా రెండు కేసుల్ని లోగడ న్యాయస్థానాలు కొట్టేశాయి. ఇందులో ఒకటి సుప్రీంకోర్టు ముందు అప్పీ ల్‌కు వెళ్లింది. రెండు కృష్ణజింకలను వేటాడటానికి సంబంధించిన కేసులో ప్రస్తుతం జైలు శిక్ష పడింది.
పెండింగ్ కేసుల విషయంలో మనం ప్రపంచ రికార్డు నెల కొల్పాం. న్యాయం కోసం కోర్టు మెట్లెక్కితే ఏళ్లూ పూళ్లూ గడుస్తున్నా అది అందడం గగనమవుతోంది. దర్యాప్తు ప్రక్రియ, విచారణ అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉంటాయి. జనాభాకు తగ్గట్టుగా న్యాయస్థానాల సంఖ్య పెంచాలని, న్యాయ మూర్తుల నియామకాలు పెరగాలని న్యాయవ్యవస్థ నుంచి వినతులు వస్తున్నా ఏ ప్రభుత్వమూ సరిగా పట్టించుకోదు. పర్యవసానంగా కక్షిదారులు తమకెప్పుడు న్యాయం దక్కుతుందా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటారు. కేసుల్లో ఇరుక్కుని జైళ్ల పాలైనవారిది కూడా ఇదే పరిస్థితి.
సల్మాన్ ఖాన్‌పై పెట్టిన కేసుల్లో సంక్లిష్టత ఏమీ లేదు. ఏళ్ల తరబడి దర్యాప్తు చేయడానికి అవి అంతర్రాష్ట్ర సంబంధాలున్న కేసులు కాదు...విదేశాల నుంచి ఎవరినో రప్పించి తేల్చవలసింది ఏమీ లేదు. అయినా అభియోగాలు రుజువై శిక్ష పడటానికి ఇరవైయ్యేళ్లు పట్టింది. వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వా లేదు... ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడే స్థితి ఉండరాదన్నది న్యాయ శాస్త్ర సిద్ధాంతం. ఆ పేరిట ఇలా ఏళ్ల తరబడి దర్యాప్తు, విచారణ కొనసాగుతూపోతే అసలు చట్టాలను రూపొందించడంలోని మౌలిక ఉద్దేశమే దెబ్బతింటుంది. తప్పు చేయ డానికి జనం భయపడే పరిస్థితి ఉండాలని, సమాజం సజావుగా సాగడానికి ఇది అవసరమని భావించి చట్టాలు ఏర్పరుస్తారు. దర్యాప్తు చకచకా సాగి, అవసరమైన సాక్ష్యాధారాలు సేకరించి సకాలంలో న్యాయస్థానాల్లో కేసులు దాఖలు చేయ గలిగితే... అక్కడ చురుగ్గా విచారణ సాగేందుకు అనువైన పరిస్థితులుంటే నింది తులకు శిక్ష వెనువెంటనే పడుతుంది. అప్పుడు చట్టాలంటే భయం ఉంటుంది. కానీ మన దేశంలో అందుకు విరుద్ధమైన పరిస్థితులున్నాయి.
కేసులు ఎడతెగకుండా సాగుతున్నకొద్దీ సాక్షుల్లో నిరాశ ఏర్పడుతుంది. వారిపై ఒత్తిళ్లు బయల్దేరతాయి. బెదిరింపులొస్తాయి. ఈ ఉదంతానికి సంబంధించే దాఖలైన చింకారాల వేట కేసులో సల్మాన్‌కు 2006లో కింది కోర్టు అయిదున్నరేళ్ల శిక్ష విధించింది. దాన్ని సవాలు చేస్తూ ఆయన రాజస్తాన్ హైకోర్టును ఆశ్రయించగా...ఆ శిక్ష నిడివిని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేసింది. పదేళ్ల తర్వాత 2016లో ఆ కేసులో హైకోర్టు సల్మాన్‌ను నిర్దోషిగా విడిచిపెట్టింది. దానిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అప్పీల్ ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. చింకారాల వేటకు సంబంధించి ఆయుధాల చట్టంకింద నమోదైన మరో కేసు నిరుడు జనవరిలో కింది కోర్టులో వీగిపోయింది.
ఇప్పుడు శిక్షపడిన కృష్ణ జింకల వేట కేసు ఆ పరంపరలో చివరిది. జో«ద్‌పూర్ అడవికి సమీపంలోని కంకాణి గ్రామంలోని బిష్ణోయ్ తెగ పౌరులు వన్యప్రాణులను ప్రాణప్రదంగా చూసుకుంటారు. సంపన్నవర్గాలవారు వేటకోసమని వస్తే వారికి చుక్కలు చూపిస్తారు. సల్మాన్ తదితరులంతా అర్ధరాత్రి వేటాడుతుంటే తుపాకి పేలుళ్ల శబ్దం విని బయటికొచ్చిన గ్రామస్తులకు అక్కడ కృష్ణజింకల కళేబరాలు కనబడటంతో ఆగ్రహోదగ్రులయ్యారు. వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. గ్రామస్తులను తుపాకులతో బెదిరించి నటీనటులంతా వాహనంలో పరారయ్యారని ఆరోపణలొచ్చాయి. ఆ తర్వాత వారంతా అటవీశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మొత్తం 28మంది సాక్షులుండగా 2013లో విచారణ ప్రారంభమైంది. సాక్షుల విచారణ, నిందితుల వాంగ్మూలాల నమోదు వగైరాలు పూర్తికావడానికి అయిదేళ్లు పట్టింది. గత నెలాఖరున వాదప్రతివాదాలు పూర్తయ్యాయి. మద్యం సేవించి కారు నడిపి ఒకరి ప్రాణం తీసి, మరో నలుగురిని గాయపరిచిన కేసు నుంచి మూడేళ్లక్రితం బొంబాయి హైకోర్టు తీర్పుతో ఆయన విముక్తుడయ్యారు.
సల్మాన్‌ఖాన్ సినీ రంగ దిగ్గజం కనుక, ఆయన సినిమాలు కోట్లాది రూపా యల వ్యాపారంతో ముడిపడి ఉంటాయి గనుక ఈ కేసుకు ఇంత ప్రాధాన్యత ఏర్పడింది. నిజానికి అందువల్లనే ఇది సత్వరమే కొలిక్కి వచ్చి ఉంటే వన్యప్రాణుల వేటకు సంబంధించిన చట్టాలు కఠినంగా ఉంటాయని, అందులో ఇరుక్కుంటే తప్పించుకోవడం కష్టమన్న భావన అందరిలో కలిగేది. లక్ష్యం నెరవేరేది. అమెరికా పరిస్థితి ఇందుకు భిన్నం. అక్కడ ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణ లొచ్చిన వ్యాపార దిగ్గజాలు రాజరత్నం, రజత్‌గుప్తాలపై అరెస్టయిన రెండేళ్ల వ్యవధిలోనే శిక్షలు విధిస్తూ తీర్పులు వెలువడ్డాయి. మన దేశంలో పెండింగ్ కేసులను సాధ్యమైనంత త్వరగా కొలిక్కి తీసుకురావాలని అనుకోవడమేగానీ అది ఆచరణసాధ్యం కావడం లేదు. లోక్ అదాలత్‌ల ఏర్పాటు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు వగైరాలు అందులో భాగమే.
దేశంలో వేయికి పైగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులుంటే... అందులో 32 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 23 హైకోర్టుల్లో దాదాపు 38 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అంటే ఒక్కో హైకోర్టులో సగటున 1.65 లక్షల కేసులు ఎటూ తేలకుండా ఉన్నాయన్నమాట! కిందికోర్టుల్లో 2 కోట్ల 60 లక్షల కేసులు అతీగతీ లేకుండా పడి ఉన్నాయి. కాలం గడుస్తున్నకొద్దీ ఇవి మరింతగా పెరుగుతున్నాయి. పెండింగ్ కేసుల తీరుతెన్నులెలా ఉంటున్నాయో సల్మాన్ కేసుతో అందరికీ మరింతగా తెలిసివచ్చింది. ఇది అంతిమంగా ఆ సమస్య పరిష్కారానికి ఎంతో కొంత దోహదపడితే మంచిదే.
Comments
Please login to add a commentAdd a comment