అమర్సింగ్కు ములాయం జెల్ల!
సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్.. తన పాత మిత్రుడు అమర్సింగ్కు మరోసారి జెల్లకొట్టారు. వచ్చే నెలలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీచేసే ఆరుగురు అభ్యర్థుల పేర్లు వెల్లడించారు. వాటిలో అమర్ సింగ్ పేరు మాత్రం లేదు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అమర్ సింగ్ పదవీకాలం త్వరలోనే ముగుస్తోంది. అయితే, సమాజ్వాదీ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో రాంగోపాల్ యాదవ్, జావేద్ అలీ, చంద్రపాల్ సింగ్ యాదవ్, నీరజ్ శేఖర్, రవిప్రకాష్ వర్మ, తంజీమ్ ఫాతిమాల పేర్లు మాత్రమే ఉన్నాయి.
వాళ్లలో నీరజ్ శేఖర్.. మాజీ ప్రధాని చంద్రశేఖర్ కొడుకు. ఫాతిమా.. మంత్రివర్గంలో అత్యంత శక్తిమంతుడైన ఆజం ఖాన్ భార్య. రాంగోపాల్ యాదవ్ అంటే స్వయానా ములాయం సింగ్ యాదవ్కు బంధువు. చాలామంది ఈసారి అమర్ సింగ్కు కూడా రాజ్యసభ అవకాశం వస్తుందని అంచనా వేశారు గానీ, అది మాత్రం సాధ్యం కాలేదు. కొన్ని రోజుల క్రితం అమర్ సింగ్ వెళ్లి సీఎం అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ ఇద్దరినీ కలిశారు. కానీ, అసలు అమర్సింగ్ మళ్లీ పార్టీలోకి రావడాన్నే రాంగోపాల్ యాదవ్, ఆజంఖాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఎలాగోలా ఆ అడ్డంకులను అధిగమించి అమర్ సింగ్ వచ్చినా, చివరకు ఆయనకు పదవి దక్కకుండా వీరిద్దరూ అడ్డుకుని.. తమవాళ్లకు ఇప్పించుకోవడంలో విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఈసారి మొత్తం 10 మందిని ఎన్నుకోవాలి. అసెంబ్లీలో బలాన్ని బట్టి సులభంగా 6 సీట్లు సమాజ్వాదీకి దక్కుతాయి.