
తీవ్ర నిరాశకు గురైన సానియా మీర్జా
ఆగ్రా : ఆసియా కీడ్రల్లో పతకాలు సాధించిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తీవ్ర నిరాశకు గురైంది. ప్రపంచపు ఏడు వింతలలో ఒకటి అయిన తాజ్ మహల్ అందాలను ఆమె వీక్షించలేకపోయింది. తాజ్ మహల్ సందర్శనార్థం ఆమె మంగళవారం సాయంత్రం ఆగ్రా వచ్చినా ఫలితం లేకపోయింది. సానియా అక్కడకు చేరుకునే సరికే సందర్శన సమయం మించిపోవటంతో గేట్లు మూసివేసినట్లు టూరిస్ట్ గైడ్ వేద్ గౌతమ్ తెలిపాడు.
కాగా తాజ్ మహల్ దర్శించుకోలేక పోయిన సానియా ....దూరం నుంచే ఓ ఫోటో తీసుకుని సంతృప్తి పడింది. మరోవైపు మాజీ క్రికెటర్ అనీల్ కుంబ్లే కూడా నిన్న సాయంత్రం తాజ్ మహల్ను సందర్శించాడు. వీరిద్దరూ ఆగ్రాలోని జైపీ ప్యాలెస్ హోటల్లో జరగబోయే ఓ ప్రయివేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేశారు.