
ముంబై : మహారాష్ట్రలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముంబై, ఢిల్లీ వేదికలుగా రాజకీయ సమీకరణలు వేగంగా మారుతూ ఉత్కంఠ పెంచుతున్నాయి. ఎన్సీపీతో చర్చలు జరిపిన శివసేన తమ సారథ్యంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేసింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమైన తర్వాత శివసేన ఈ ప్రకటన చేయడం గమనార్హం. మరోవైపు మహారాష్ట్రలో అధికారం నిలుపుకునేందుకు బీజేపీ పావుల కదుపుతోంది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీలో పార్టీ అగ్రనేత, హోంమంత్రి అమిత్ షాతో మంతనాలు జరిపారు. మహారాష్ట్రలో తదుపరి ముఖ్యమంత్రి శివసైనికుడేనని న్యాయం కోసం తాము జరిపే పోరాటంలో విజయం తమదేనని ఆ పార్టీ ఎంపీ, సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర సీఎం రేసులో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ లేరని, శివసేన నేతే సీఎం పగ్గాలు చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. తాను శరద్ పవార్‌తో మాట్లాడానని, ఇతర పార్టీల నేతలూ తనతో టచ్‌లో ఉన్నారని సంజయ్ రౌత్ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment