కేంద్రీయ విద్యాలయాల్లో 3వ భాష
న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో 6 నుంచి 8వ తరగతి వరకూ మూడో భాషగా సంస్కృతాన్ని బోధించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ మేరకు గురువారం అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనానికి అఫిడవిట్ సమర్పించారు. అక్టోబర్ 27న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ నేతృత్వంలో జరిగిన కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో మూడో భాషగా జర్మన్ స్థానంలో సంస్కృతాన్ని బోధించాలని, జర్మన్‌ను అదనపు సబ్జెక్ట్‌గా విద్యార్థులకు బోధించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం వల్ల 500 కేంద్రీయ విద్యాలయాల్లో 6 నుంచి 8వ తరగతి చదువుతున్న 70 వేల మంది విద్యార్థులపై ప్రభావం పడనుందని విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు.
నవంబర్ 21న ఈ పిల్‌ను విచారించిన సుప్రీంకోర్టు 27వ తేదీలోగా స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ భాష ఎంపికకు సంబంధించిన నిర్ణయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులకే వదిలేయాలని, ఇందులో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని, అందులోనూ విద్యా సంవత్సరం మధ్యలో దీనిపై నిర్ణయం తీసుకోవడం తగదని చెప్పారు. ఎటువంటి సంప్రదింపులు జరపకుండా, దీనిపై ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. దీంతో విచారణను న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది.
**