'నిజాలు చెప్పడమే నేను చేసిన నేరమా?'
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రిపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసి, ట్వీట్ల యుద్ధం ప్రకటించి పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు పడిన బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ మరోసారి ఘాటుగా స్పందించారు. నిజాలు చెప్పడమే తానే చేసిన నేరమైతే.. ఎప్పటికీ నేరాలకు పాల్పడుతూనే ఉంటానని వ్యాఖ్యానించారు. కీర్తి ఆజాద్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తనకు నోటీసులు అందాయని ఆజాద్ తెలిపారు. ఈ విషయంపై త్వరలోనే స్పందిస్తానన్నారు. నా సస్పెన్షన్కు గల కారణాలేంటో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానమివ్వాలని ఈ సందర్బంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై పార్టీ సీనియర్ నేత సుబ్రమణ్యం స్వామి సహాయాన్ని కోరనున్నట్లు ఆయన వెల్లడించారు. గతంలో బీసీసీఐకి సంబంధించిన అవినీతిపై తాను ప్రశ్నలు లేవనెత్తానని గుర్తచేశారు.
పార్టీపై తాను ఎప్పుడు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదని, కేవలం అవినీతిపై మాత్రమే తాను నోరు విప్పినట్లు చెప్పారు. ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) లో జరిగిన అక్రమాల గురించి గత తొమ్మిదేళ్లుగా తాను చెబుతన్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదన్నారు. డీడీసీఏ అక్రమాల వ్యవహారంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీపై బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. సొంత పార్టీకి చెందిన అగ్రనేత అయిన జైట్లీకి ఆయన బహిరంగ సవాల్ విసిరారు. జైట్లీ తనపై కూడా పరువునష్టం దావా వేయాలని, 13 ఏళ్ల పాటు డీడీసీఏ అధ్యక్షుడిగా వ్యవహరించిన జైట్లీ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కీర్తి ఆజాద్ సానుకూలంగా స్పందిస్తూ వస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయనపై పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు పడింది.