ఆ హీరో మరో 'హీరో'ను పొగిడారు!
పట్నా: అలనాటి బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా సహచర పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్‌ను 'హీరో' అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. ఆయన అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని కితాబిచ్చారు. ఢిల్లీ క్రికెట్ బోర్డు అక్రమాల విషయంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీపై కీర్తి ఆజాద్ బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ అసమ్మతి ఎంపీగా ముద్రపడిన షాట్‌గన్ శత్రుఘ్న ఆయనకు బాసటగా నిలువడం గమనార్హం. 'ఈ రోజుకు నిజమైన హీరో కీర్తి ఆజాదే. మిత్రులారా నాదొక విన్నపం. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేవారిపై వెంటనే విరుచుకుపడకండి. వారిపై నిర్బంధ చర్యలకు పాల్పడకండి' అని శత్రుఘ్న బుధవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఎంపీ కీర్తి ఆజాద్‌పై బీజేపీ అధినాయకత్వం చర్యలు తీసుకోకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు విభిన్నమైన పార్టీగా పేరొందిన బీజేపీ ఇప్పుడు విభేదాలు పార్టీగా మారిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా డీడీసీఎ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీకి కూడా ఆయన ఓ సలహా ఇచ్చారు. ఈ వ్యవహారాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలని, గతంలో అద్వానీజీ అనుసరించిన మార్గాన్ని జైట్లీ కూడా పాటించాలని సూచించారు. హవాలా కుంభకోణంలో ఆరోపణలు రావడంతో 1990లో అద్వానీ ఎన్నికల్లో పోటీచేయని విషయాన్ని పరోక్షంగా గుర్తుచేశారు.
KirtiAzad-hero of the day.Humble appeal to friends.Avoid knee jerk reaction/coercive action against friend who's fighting against corruption
— Shatrughan Sinha (@ShatruganSinha) December 23, 2015