రేపే తీర్పు... మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్‌ | Security Alert In Jodhpur On Asaram Verdict | Sakshi
Sakshi News home page

రేపే తీర్పు... మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్‌

Published Tue, Apr 24 2018 9:08 PM | Last Updated on Sat, Sep 1 2018 5:08 PM

Security Alert In Jodhpur On Asaram Verdict - Sakshi

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ అత్యాచార ఆరోపణల కేసులో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ ట్రయల్‌ కోర్టు బుధవారం తీర్పు వెల్లడించనుంది. దీంతో జోధ్‌పూర్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆశారాం అనుచరులు విధ్వంసక చర్యలకు దిగుతారేమోనన్న అనుమానంతో ఈ నెల 30వ తారీకు వరకు 144 సెక్షన్‌ను అమలు చేశారు. 2013 సంవత్సరం నుంచి జైలు ఊచలు లెక్కిస్తున్న ఆశారాం బాపూపై మూడు అత్యాచార కేసులు నమోదై ఉన్నాయి. 2013 సంవత్సరం ఆగస్టులో పదహారేళ్ల అమ్మాయి జోధ్‌పూర్‌లోని ఆశ్రమంలో ఆశారామ్‌ తనపై లైంగిక దాడి చేశారంటూ ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

ఆ అమ్మాయికి పట్టిన దెయ్యాన్ని వదిలిస్తానని మభ్యపెట్టిన ఆశారాం ఆమెపై అత్యాచారం జరిపినట్టు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదైనప్పటికీ ఆశారాం బాపూ పోలీసుల ఎదుట హాజరు కాలేదు. అందరి కళ్లు గప్పి ఇండోర్‌లోని తన ఆశ్రమంలో దాక్కున్నాడు. నాన్‌బెయిల్‌బుల్‌ అరెస్ట్‌ వారెంట్లు జారీ చేసినప్పటికీ అతను బయటకి రాలేదు. అతనిని అరెస్ట్‌ చేయడం కూడా ఒక ప్రహసనంగానే మారింది. ఈ సందర్భంగా పోలీసులకు, ఆశారాం అనుచరులకు మధ్య తీవ్రమైన ఘర్షణలు కూడా జరిగాయి. చివరికి 2013 సెప్టెంబర్‌ 1న ఆశారాంను రాజస్థాన్‌ జోధ్‌పూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత ఈ కేసులో సాక్షులపైన ఆశారాం బాపూ ప్రైవేట్‌సైన్యం బెదిరింపులు, దాడులకు దిగింది. తన కండబలం ప్రదర్శించింది. ఆశారాంకు బెయిల్‌ ఇవ్వకపోతే చంపేస్తామంటూ కేసును విచారించిన  న్యాయమూర్తిని కూడా బెదిరించారు. దీంతో సుప్రీంలో కూడా అతనికి బెయిల్‌ లభించలేదు. ఈ కేసులో ఆశారాంపై ఆరోపణలు రుజువైతే ఆయనకు గరిష్టంగా పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

మరో రెండు అత్యాచార కేసులు
ఆశారాం బాపూని అరెస్ట్‌ చేసి రెండు నెలలు తిరక్కుండానే సూరత్‌కు చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్లు  ఆశారాంతో పాటు ఆయన కుమారుడు నారాయణ సాయి కూడా అమ్మాయిల్ని లైంగికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. అహ్మదాబాద్‌ సమీపంలోని ఆశ్రమంలో 2001, 2006 సంవత్సరం మధ్య ఆశారాం తనపై చాలాసార్లు లైంగికంగా దాడులకు దిగాడని అక్క ఆరోపణలు చేస్తే, సూరత్‌ ఆశ్రమంలో నారాయణ సాయి తనను అత్యాచారం చేశాడంటూ చెల్లి కోర్టుకెక్కింది. దీంతో పోలీసులు నారాయణ సాయిని కూడా అదుపులోనికి తీసుకున్నారు.

ఆశారాం ఎలా ఎదిగాడు ?
1941 సంవత్సరంలో ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న సిం«ద్‌ ప్రాంతంలో పుట్టిన ఆశారాం 15 ఏళ్ల వయసులోనే ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయాడు. కేవలం మూడో తరగతి మాత్రమే చదువుకున్న అతను ఆధ్యాత్మిక మార్గం పట్టాడు. గురు లీలాషాజీ మహరాజ్‌ దగ్గర శిష్యరికం చేశాడు. 1972 సంవత్సరంలో గుజరాత్‌లోని మొటెరా దగ్గర సబర్మతి తీరంలో చిన్న కుటీరాన్ని ఏర్పాడు చేశాడు.  తనని తాను దేవుడిగా ప్రకటించుకుని ప్రవచనాలు చెప్పడం మొదలు పెట్టాడు. ఏడాదిలోనే ఆ కుటీరం కాస్త ఆశ్రమంగా మారిపోయింది. ఆధ్యాత్మిక గురువుగా దేశవిదేశాల్లో ప్రఖ్యాతి వహించాడు.  ప్రస్తుతం ఆయనకి దేశవిదేశాల్లో 400 ఆశ్రమాలు  2 కోట్ల మంది శిష్యపరివారం ఉంది. పార్టీలకతీతంగా ఎందరో రాజకీయ వేత్తలు ఆయనకు పరమ వీర భక్తులు.

వివిధ రాష్ట్రాల్లో ఎన్నో ప్రభుత్వాలు ఆయన ఆశ్రమాలకు అయాచితంగా భూ కేటాయింపులు చేశాయి. ఆశారాం ఆస్తులు చూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే. ఏకంగా 10 వేల కోట్ల విలువైన ఆస్తుల్ని కూడబెట్టాడు. అతని ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగడుగునా వివాదాలే చోటు చోసుకున్నాయి. భూకబ్జా ఆరోపణలు, ఆశ్రమంలో అనుమానాస్పద మృతులు వంటివి ఎప్పట్నంచో ఉన్నాయి. అత్యాచార ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన ఆశ్రమం ఎన్ని అరాచకాలకు నెలవుగా మారిందో ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చాయి. (సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement